ఫోన్లొచ్చాయ్గా! ఇక టీవీలు!!

16 Aug, 2016 00:29 IST|Sakshi
ఫోన్లొచ్చాయ్గా! ఇక టీవీలు!!

చైనా నుంచి.. వెల్లువలా ఎల్‌ఈడీ టీవీలు
పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలదీ ఇదే బాట  
 
32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ రూ.9 వేలకే
ధరలో, ఫీచర్లలో దిగ్గజాలకు పెను సవాలు   
దేశంలోనే అసెంబ్లింగ్‌కు పలు కంపెనీల కసరత్తు
అమ్మకానికి మాత్రం ఆన్‌లైన్ మార్గానికే ఓటు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : లా ఇకో... మెల్బాన్... నోబుల్... ఇన్‌ఫోకస్... దైవా... ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? వినకేం... వీటిలో కొన్ని కంపెనీల మొబైల్స్ చూశాం కదా!! అని కొందరంటే... అరె!! ఏం ఆ మొబైల్స్ వాడుతున్నాం కదా!! అని మరికొందరంటారు. కానీ ఇదేమీ మొబైల్ మాట కాదు. పోటీలు పడే ఫీచర్లతో, ప్రత్యర్థులు అందుకోలేని ధరలతో మార్కెట్‌ను అదరగొడుతున్న టీవీల గురించి. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ ఇపుడు టెలివిజన్ రంగంలో హల్‌చల్ చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీకి ప్రపంచ హబ్‌గా మారిన చైనాయే... ఇపుడు టీవీలకూ కేంద్రమైంది. అక్కడి నుంచే ఈ కంపెనీలన్నీ తమ తమ బ్రాండ్లతో కళ్లు చెదిరే టీవీలను మార్కెట్లోకి తెస్తున్నాయి మరి.

 ఒకదాని వెంట ఒకటి..
ఒకప్పుడు టీవీ అనగానే సోనీ, శామ్‌సంగ్, ఎల్‌జీ, ప్యానాసోనిక్, హాయర్, ఒనిడా, వీడియోకాన్, హిటాచీ, షార్ప్, తోషిబా వంటి బ్రాండ్లు వినిపించేవి, ఇపుడు మాత్రం వందల బ్రాండ్లు భారత మార్కెట్లో కొలువు తీరాయి. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని కంపెనీలైతే 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలను రూ.9 వేల నుంచి విక్రయిస్తున్నాయి. రూ.12 వేలలోపు ధరలో ప్రస్తుతం వివిధ కంపెనీలవి 160 మోడళ్లు అందుబాటులో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అంతేకాదు!! అంతర్జాతీయంగా టాప్ బ్రాండ్స్‌గా ఉన్న కంపెనీలు సైతం ఇండియాలో అతితక్కువ ధరల వ్యూహాన్నే అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు టీసీఎల్ వంటి దిగ్గజం ఏకంగా రూ.32 వేలకే 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. సాన్‌సూయి, లా ఇకో, నోబుల్, ఐ గ్రాస్ప్, ఇంటెక్స్ వంటి కంపెనీలు సైతం హై ఎండ్ విభాగంలో పోటీ పడుతున్నాయి.  గతంలో కస్టమర్ల మదిని చూరగొన్న బీపీఎల్ సైతం తిరిగి ఇక్కడి మార్కెట్లో ఆన్‌లైన్ ద్వారా పునఃప్రవేశం చేసింది. కెమెరాల తయారీలో టాప్ బ్రాండ్‌గా ఉన్న ‘కొడాక్’... టీవీ మార్కెట్లో అద ృష్టాన్ని పరీక్షించుకుంటూ పలు మోడళ్లను ప్రవేశపెట్టింది. లా ఇకోతో పాటు ఇన్‌ఫోకస్, సాన్యో, నోబుల్, లైవ్ తదితర కంపెనీలు పోటాపోటీగా మోడళ్లు తెస్తున్నాయి. షావొమీ టీవీలు త్వరలో రానున్నాయి.

 ఆన్‌లైనే అసలైన వేదిక...
ఒకప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని విక్రయించాలంటే రిటైల్ స్టోర్లకు సరఫరా చేయటం, వారిని ఒప్పించటం పెద్ద తతంగం. కానీ ఆన్‌లైన్ ఊతంతో పరిస్థితి మారింది. లా ఇకో, ఇన్‌ఫోకస్, బీపీఎల్, దైవా, కొడాక్ బ్రాండ్లు ఆన్‌లైన్లోనే లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం టీవీల్లో 20 శాతం అమ్మకాలు ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయి కూడా. ‘‘లాభాలు రావాలంటే ఆన్ లైన్ మార్గమే ఉత్తమం’’ అని దైవా డెరైక్టర్ అర్జున్ బజాజ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.

 దక్షిణాదిలోనైతే 60 శాతం విక్రయాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని గుర్తు చేశారు. ‘ప్యానెళ్ల ధర పెరుగుతోంది. దీంతో ఎల్‌ఈడీ టీవీల ధర సైతం మున్ముందు పెరుగుతుంది. భవిష్యత్‌లో ఆన్‌లైన్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. జీఎస్‌టీ అమలైతే మార్కెట్ ఒక్కసారిగా మారిపోతుంది’’ అని చెప్పారాయన. చైనాలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారు కాబట్టి తయారీ వ్యయం తక్కువ. ఆన్‌లైన్ విధానంలో మధ్యవర్తులు లేకపోవడంతో విక్రయించే కంపెనీలకు ఖర్చులు భారీగా తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు బొమ్మారెడ్డి ప్రసాదరెడ్డి తెలిపారు. అందుకే పోటీ ధరల్లో ఉపకరణాలను విక్రయిస్తాయని చెప్పారు.

తయారీకి ప్రణాళికలు..
గతేడాది దేశంలో 1.2 కోట్ల యూనిట్ల ఎల్‌ఈడీ టీవీలు అమ్ముడయ్యాయి. వీటిలో స్మార్ట్ టీవీల వాటా 8-10 శాతం. కంపెనీలు ఇటువైపు రావటానికి కారణమిదే. ఇది చూసి మైక్రోమ్యాక్స్ వంటి కంంపెనీలు స్థానికంగా తయారీ కూడా మొదలెట్టాయి. మొబైల్ ఫోన్ల తరహాలోనే చైనా నుంచి నేరుగా టీవీ సెట్స్‌ను దిగుమతి చేసి ఇక్కడ విక్రయించేవి కొన్నయితే... మరికొన్ని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తున్నాయి. అమ్మకాల విషయంలో మాత్రం స్మార్ట్‌గా వ్యవహరిస్తూ ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్‌లైన్ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి. మైక్రోమ్యాక్స్ రుద్రపూర్ ప్లాంటు పెట్టగా కార్బన్ మొబైల్స్ రూ.150 కోట్లతో నోయిడాలో యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. డిసెంబరుకల్లా స్మార్ట్ టీవీలతో మార్కెట్లోకి రావాలని కంపెనీ యోచిస్తోంది. సెల్‌కాన్ సైతం తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లలో టీవీలను అసెంబుల్ చేయనుంది. ప్రస్తుతానికి మేడ్చల్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేపడుతోంది.

దక్షిణాదిన దైవా ప్లాంటు..
దైవా ఇటీవలే 32, 40 అంగుళాల సైజులో మూడు స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ.9,399 నుంచి ప్రారంభం. ఈ ఏడాదే పెద్ద సైజున్న ఎల్‌ఈడీ టీవీలు, అల్ట్రా హెచ్‌డీ టీవీలను సైతం ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయ బ్రాండ్లతో పోలిస్తే 50 శాతం తక్కువకే, అవే ఫీచర్లతో టీవీలను విక్రయిస్తామని అర్జున్ బజాజ్ తెలిపారు. దైవాను ప్రమోట్ చేస్తున్న వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ 30కిపైగా ఇతర బ్రాండ్లకు నోయిడాలోని ప్లాంటులో పలు మోడళ్లను తయారు చేస్తోంది. మదర్ బోర్డులను భారత్‌లో తయారు చేస్తున్న రెండు మూడు కంపెనీల్లో ఇదొకటి. దైవా బ్రాండ్‌తో సొంతంగా ఫ్లాట్ ప్యానెళ్ల మార్కెట్లో ప్రవేశించిన ఈ కంపెనీ అమ్మకాలు పెరిగితే దక్షిణాదిన ప్లాంటు పెట్టాలని భావిస్తోంది. సొంత ప్లాంట్లు, సొంత డిజైన్ కేంద్రాలున్న కంపెనీలే పోటీలో నిలదొక్కుకుంటాయని కంపెనీ అంటోంది. తక్కువ మార్జిన్ ఉన్నా ఇటువంటి కంపెనీలు నెట్టుకొస్తాయని చెబుతోంది.

మరిన్ని వార్తలు