ట్రేడ్‌వార్‌లో చైనానే విలన్‌!

1 Dec, 2019 02:45 IST|Sakshi

మరో పదేళ్లు కొనసాగినా ఆశ్చర్యం లేదు 

ఈయూ మాజీ ట్రేడ్‌ కమిషనర్‌ కారల్‌ డీ గష్‌

హైదరాబాద్, సాక్షి బిజినెస్‌: చైనాతో అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే ఛాన్సు లేదని బెల్జియం రాజకీయ ప్రతినిధి, యూరోపియన్‌ యూనియన్‌ మాజీ ట్రేడ్‌ కమిషనర్‌ కారల్‌ డీ గష్‌ అభిప్రాయపడ్డారు. అదిగో డీల్‌ కుదరుతోంది, ఇదిగో కుదురుతోందంటూ వచ్చే వార్తలతో స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీయడమే కానీ, నిజానికి ఎలాంటి డీల్‌ కుదరకపోవచ్చన్నారు. ట్రేడ్‌వార్‌ అనేది ఒక వ్యవస్థీకృత సమస్యని, ఇందుకు చైనానే ప్రధాన కారణమని, కానీ చైనాను దారికి తెచ్చేందుకు అమెరికా అనుసరిస్తున్న బలవంతపు విధానం సత్ఫలితాలు ఇవ్వదని చెప్పారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో పదేళ్లు ట్రేడ్‌వార్‌ కొనసాగినా ఆశ్చర్యం లేదన్నారు. బెల్జియం, ఇండియా మధ్య ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో వాణిజ్య సహకారం కోసం బెల్జియం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఇక్కడ ట్రేడ్‌వార్‌తో పాటు పలు అంశాలపై మాట్లాడారు. ‘బ్రెగ్జిట్‌ కారణంగా ఈయూలో బెల్జియం, నెదర్లాండ్స్‌పై అత్యధిక ప్రతికూల ప్రభావం ఉంటుంది. ట్రేడ్‌వార్, బ్రెగ్జిట్‌ నేపథ్యంలో ఇండియా, యూరోపియన్‌ యూని యన్‌ మధ్య సరికొత్త వాణిజ్య అవకాశాలకు అపార అవకాశముంది. అయితే భారత్‌ నుంచి ఈ దిశగా సరైన చర్యల్లేవు’ అని కారల్‌ డీ గష్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు