నిషేధిత 59 చైనీస్‌ యాప్స్‌ అవుట్‌ 

3 Jul, 2020 01:20 IST|Sakshi

గూగుల్‌ ప్లే, యాప్‌ స్టోర్‌ భారత విభాగాల నుంచి తొలగింపు 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనీస్‌ యాప్స్‌ను గూగుల్, యాపిల్‌ భారత్‌లోని తమ యాప్‌స్టోర్స్‌ నుంచి తొలగించాయి. దీంతో భారత్‌లోని మొబైల్‌ ఫోన్‌ యూజర్లకు ఇవి అందుబాటులో ఉండవు. దేశ సమగ్రతకు, భద్రతకు ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం 59 చైనీస్‌ యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గూగుల్‌ తమ ప్లే స్టోర్‌ నుంచి, యాపిల్‌ తమ యాప్‌ స్టోర్‌ నుంచి వీటిని అందుబాటులో లేకుండా చేశాయి. తాత్కాలికంగా భారత ప్లే స్టోర్‌ విభాగంలో పలు యాప్స్‌ను బ్లాక్‌ చేసినట్లు గూగుల్‌ తెలిపింది. నిషేధం ఎదుర్కొంటున్న వాటిల్లో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్‌ఇట్, ఉయ్‌చాట్, క్యామ్‌స్కానర్, మి కమ్యూనిటీ మొదలైనవి ఉన్నాయి. 

చట్టపరమైన చర్యల యోచన లేదు: టిక్‌టాక్‌ .. 
ప్రభుత్వ నిషేధంపై టిక్‌టాక్‌ స్పందించింది. దీనికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనేదీ లేదని స్పష్టం చేసింది. ‘అలాంటి ప్రణాళికలేమీ మాకు లేవు. ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారత ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు లోబడే మేం పనిచేస్తాం. యూజర్ల డేటా భద్రత, వ్యక్తిగత వివరాల గోప్యతకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తాం‘ అని టిక్‌టాక్‌ ప్రతినిధి పేర్కొన్నారు.  మరోవైపు, నిషేధిత యాప్స్‌లో ఒకటైన బిగో లైవ్‌ కూడా స్పందించింది. ‘మేం భారత ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తాం. దీనిపై చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటాం‘ అని పేర్కొంది.

నియామకాల ప్రణాళికల్లో చింగారీ 
చైనీస్‌ యాప్‌లపై నిషేధంతో దేశీ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా యాప్స్‌ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అనేక రెట్లు పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను వచ్చే కొద్ది నెలల్లో 200కి పెంచుకోవాలని యోచిస్తున్నట్లు దేశీ షార్ట్‌ వీడియో షేరింగ్‌ యాప్‌ చింగారీ వెల్లడించింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా