పేమెంట్ బ్యాంక్ రేసు నుంచి వైదొలుగుతున్నాం

25 Mar, 2016 00:55 IST|Sakshi
పేమెంట్ బ్యాంక్ రేసు నుంచి వైదొలుగుతున్నాం

చోళమండలం ఫైనాన్స్ వెల్లడి
ముంబై: పేమెంట్ బ్యాంకుల రేసు నుంచి వైదొలుగుతున్నామని మురుగప్ప గ్రూప్‌కు చెందిన చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ బీఎస్‌ఈకి తెలిపింది. పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం తమ అనుబంధ సంస్థ చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్(సీడీఎస్‌ఎల్) ఆర్‌బీఐ నుంచి  సూత్రప్రాయ ఆమోదాన్ని పొందిందని, ఈ ఆమోదాన్ని తిరిగి ఆర్‌బీఐకే సమర్పిస్తున్నామని పేర్కొంది. పేమెంట్ బ్యాంకులకు సంబంధించిన వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉంటుందని, వ్యాపారం ప్రారంభించడానికే చాలా కాలం పడుతుందని, అందుకే ఈ రంగం నుంచి తప్పుకుంటున్నామని వివరించింది.

చెల్లింపు బ్యాంక్ వ్యాపార కార్యకలాపాల కోసం సీడీఎస్‌ఎల్‌లో రూ.75 కోట్లు పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది. ఆర్‌బీఐ గత ఏడాది ఆగస్టులో 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులకు సంబంధించి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ పేమెంట్ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో రెమిటెన్స్‌ల సేవలు నిర్వహించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.  1 లక్ష వరకూ డిపాజిట్లు అంగీకరించవచ్చు. ఖాతాదారులకు ఎలాంటి రుణాలు ఇవ్వడానికి లేదు. మురుగప్ప గ్రూప్‌కు చెందిన ఆర్థిక విభాగం, సీడీఎస్‌ఎల్.. ఇప్పటికే వాహన, ఎస్‌ఎంఈ, గృహ రుణాలందిస్తోంది. ఇన్వెస్టర్ అడ్వైజరీ సేవలను కూడా అందజేస్తోంది.

మరిన్ని వార్తలు