చోళమండలం..తగ్గిన మొండి బకాయిలు

24 Apr, 2018 00:39 IST|Sakshi

ఆల్‌టైమ్‌ హైకి షేర్‌  

ముంబై: చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.291 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభం (రూ.220 కోట్లు)తో పోల్చితే 33 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది.

నిధుల వ్యయం తక్కువగా ఉండడం, ఫీజు ఆదాయం ఎక్కువగా ఉండడం, మొండి బకాయిలు తక్కువగా ఉండడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని  కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్, ఎమ్‌డీ ఎన్‌. శ్రీనివాసన్‌ తెలిపారు. స్థూల మొండి బకాయిలు 4.66శాతం నుంచి 2.94 శాతానికి, నికర మొండి బకాయిలు 3.19 శాతం నుంచి 1.66 శాతానికి తగ్గాయని వివరించారు. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ ఆల్‌ టైమ్‌ హై, రూ.1,714ను తాకింది.

మరిన్ని వార్తలు