అంతర్జాతీయ చెల్లింపులకు ఐసీఐసీఐ ‘స్విఫ్ట్‌’

7 Apr, 2018 01:29 IST|Sakshi

ముంబై: ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు దేశాల మధ్య బ్యాంకు చెల్లింపులకు స్విఫ్ట్‌ ప్రారంభించిన నూతన నెట్‌వర్క్‌ ‘స్విఫ్ట్‌ జీపీఐ’ను వినియోగించుకోనుంది. భారత్‌ నుంచి ఈ సేవలను వినియోగించే తొలి భారతీయ బ్యాంకు ఐసీఐసీఐ అని స్విఫ్ట్‌ పేర్కొంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఉద్యోగులు స్విఫ్ట్‌ నెట్‌వర్క్‌ సాయంతో ఎల్‌వోయూల ఆధారంగా నీరవ్‌ మోదీ కంపెనీలకు లబ్ధి చేకూర్చిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ వాణిజ్యం ప్రపంచీకరణకు వెన్నెముక వంటిదే కాకుండా, భారత వృద్ధికి అత్యవసరమని స్విఫ్ట్‌ భారత విభాగం హెడ్‌ కిరణ్‌శెట్టి అన్నారు. స్విఫ్ట్‌ జీపీఐ భారత కార్పొరేట్లకు, వ్యాపార సులభతర నిర్వహణకు సాయపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్విఫ్ట్‌ నెట్‌వర్క్‌లో ఉన్న కరెస్పాండెంట్‌ బ్యాంకుల మధ్య లావాదేవీలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసేందుకు నూతన సర్వీసుతో వీలు పడుతుందని సంస్థ తెలిపింది. పారదర్శకత పెంపునకు ఐసీఐసీఐ బ్యాంకు కట్టుబడి ఉందని బ్యాంకు ఈడీ విజయ్‌చందోక్‌ అన్నారు.

మరిన్ని వార్తలు