రెండు విడతలుగా ఓఎన్‌జీసీ డిజిన్వెస్ట్‌మెంట్

26 Nov, 2014 01:05 IST|Sakshi
రెండు విడతలుగా ఓఎన్‌జీసీ డిజిన్వెస్ట్‌మెంట్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్‌జీసీ, కోల్ ఇండియాలో వాటాల విక్రయాన్ని రెండు విడతలుగా చేపట్టాలని కేంద్రం యోచిస్తోన్నట్లు సమాచారం. సరైన విలువను రాబట్టాలనే ఉద్దేశమే ఇందుకు కారణమని అధికార వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత డిజిన్వెస్ట్‌మెంట్ తేదీలను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి.

ఓఎన్‌జీసీలో 5 శాతం, కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయానికి క్యాబినెట్ ఆమోద ముద్రవేసిన సంగతి తెలిసిందే. ఓఎన్‌జీసీ ద్వారా రూ. 11,477 కోట్లు, కోల్ ఇండియా ద్వారా రూ. 15,740 కోట్లు రావొచ్చని అంచనా. అయితే డిజిన్వెస్ట్‌మెంట్ విషయంలో ఇంకా చాలా ఆటంకాలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

 మరోవైపు, ఓఎన్‌జీసీకి చెందిన కేజీ-డీ5 బ్లాకులో గ్యాస్ నిక్షేపాల అభివృద్ధిలో జాప్యం వెనుక కారణాలపై విచారణ జరుపుతున్న కమిటీ డిసెంబర్ 24 నాటికి నివేదిక సమర్పించగలదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పొరుగునే ఉన్న కేజీ-డీ6 బ్లాకులో రిలయన్స్ సంస్థ చమురు, గ్యాస్ ఉత్పత్తి దాదాపు నాలుగయిదేళ్ల క్రితమే ప్రారంభించేసింది. కానీ, కేజీ-డీ5లో ఓఎన్‌జీసీ కనుగొన్న 11 చమురు, గ్యాస్ నిక్షేపాల నుంచి ఉత్పత్తి ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. కంపెనీ అంచనాల ప్రకారం 2018 నుంచి గ్యాస్, 2019 నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభం కావొచ్చు. ఈ నేపథ్యంలోనే జాప్యంపై హైడ్రోకార్బన్స్ రంగ నియంత్రణ సంస్థ డీజీహెచ్ సారథ్యంలోని కమిటీ విచారణ చేపట్టింది.

>
మరిన్ని వార్తలు