సిప్లా- ఆర్‌ఐఎల్‌.. రికార్డుల హోరు

22 Jun, 2020 11:52 IST|Sakshi

తొలుత 10 శాతం హైజంప్‌

రూ. 692 వద్ద కొత్త గరిష్టానికి సిప్లా

రూ. 1768కు ఆర్‌ఐఎల్‌

రూ. 11 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ

సెంటిమెంటు బలపడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత సెన్సెక్స్‌ 450 పాయింట్లకుపైగా జంప్‌ చేసింది. 35,211ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తదుపరి కాస్త వెనకడుగు వేసింది. ప్రస్తుతం 158 పాయింట్లు బలపడి 35,890 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఓవైపు ఇండెక్స్‌ హెవీవెయిట్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మరోపక్క ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. వివరాలు చూద్దాం..

సిప్లా లిమిటెడ్‌
కోవిడ్‌-19 చికిత్సకు వినియోగించగల ప్రయోగాత్మక ఔషధం రెమ్‌డిసివిర్‌ తయారీ, విక్రయాలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ డీజీసీఐ నుంచి అనుమతి లభించినట్లు సిప్లా లిమిటెడ్‌ పేర్కొంది.  దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 692ను అధిగమించడం ద్వారా రికార్డ్‌ గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 665 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్‌ దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్‌ రూపొందించిన రెమ్‌డెసివిర్‌కు జనరిక్‌ ఔషధ తయారీ, విక్రయాలకు అనుమతి లభించినట్లు సిప్లా పేర్కొంది. సెప్రెమీ పేరుతో ఈ ఔషధాన్ని అత్యవసర ప్రాతిపదికన మాత్రమే వినియోగించేందుకు అనుమతి లభించినట్లు తెలియజేసింది. అమెరికాలో కరోనా వైరస్‌ సోకిన రోగులకు అత్యవసర చికిత్స నిమిత్తం రెమ్‌డెసివిర్‌ను వినియోగించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతిని గిలియడ్‌ పొందింది. ఈ ఔషధానికి గిలియడ్‌ నుంచి నాన్‌ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్స్‌ను సిప్లా గత నెలలోనే సంపాదించిన విషయం విదితమే.

రిలయన్స్‌ జోరు
డిజిటల్‌, టెలికం అనుబంధ విభాగం రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ సంస్థలపెట్టుబడులు వెల్లువెత్తిన నేపథ్యంలో జోరందుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 2.6 శాతం ఎగసి రూ. 1804ను అధిగమించింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ప్రస్తుతం 0.5 శాతం లాభంతో రూ. 1768 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ షేరు 104 శాతం దూసుకెళ్లింది. మార్చి 23న ఈ షేరు రూ. 884 వద్ద కనిష్టానికి చేరాక ర్యాలీ బాట పట్టింది. గత మూడు రోజుల్లోనే ఆర్‌ఐఎల్‌ షేరు 12 శాతం ర్యాలీ చేసింది. తద్వారా తాజాగా రూ. 11 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను సాధించింది. దేశీ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఒక కంపెనీ 150 బిలియన్‌ డాలర్ల విలువను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం!

మరిన్ని వార్తలు