మరో షాక్‌ : చైనా మొబైల్‌పై నిషేధం

4 Jul, 2018 08:31 IST|Sakshi
చైనా మొబైల్‌పై నిషేధం

వాషింగ్టన్‌ : పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. అంతర్జాతీయ వాణిజ్యాన్ని హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా టెలికమ్యూనికేషన్‌ మార్కెట్‌కు ఆఫర్‌ చేసే ‘చైనా మొబైల్‌’ సర్వీసులను బ్లాక్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. దేశ భద్రతా ప్రమాదాల దృష్ట్యా దీన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో ఇక చైనా మొబైల్‌ ఆ దేశంలో ఆపరేట్‌ చేయడానికి వీలులేదు. నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ విడుదల చేసిన ప్రకటనలో ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌కు చైనా మొబైల్‌ను అనుమతించకూడదని సూచించింది. ఏటీ అండ్‌ టీ, వెరిజోన్‌ అనంతరం ప్రపంచంలో అతిపెద్ద సంస్థ ఇదే కావడం గమనార్హం. గత కొన్ని నెలలుగా అమెరికా, చైనాపై తీసుకుంటున్న చర్యలు తెలిసినవే. ముఖ్యంగా చైనా టెక్‌ కంపెనీలు తమ మేథోసంపత్తి హక్కులను దొంగలిస్తున్నాయంటూ ట్రంప్‌ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

చైనా మొబైల్‌ దోపిడీకి దారితీసే అవకాశముందని, ఇది చైనా ప్రభుత్వ చెప్పుచేతల్లో నడుస్తుందని, దీంతో దేశ భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అకాశముందని అమెరికా అథారిటీలు పేర్కొంటున్నాయి. చైనా మొబైల్‌తో కార్యకలాపాలు పెరిగితే, అమెరికా న్యాయ వ్యవస్థకు ప్రమాదాలు పెరిగి, దేశ భద్రతా ప్రయోజనాలను పరిష్కరించుకోలేమని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ కమ్యూనికేషన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ డేవిడ్‌ రెడ్ల్‌ చెప్పారు. ప్రస్తుతం చైనా మొబైల్‌కు 899 మిలియన్‌ మంది సబ్‌స్క్రైబర్లున్నారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా మొబైల్‌ ఇంకా స్పందించలేదు. చైనా మొబైల్‌పై నిషేధం వాషింగ్టన్‌, బీజింగ్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు ముదురుతున్నట్టు తెలిసింది. జూలై 6 నుంచి 34 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై కూడా టారిఫ్‌లు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి తగ్గట్టు బీజింగ్‌ కూడా స్పందించనున్నట్టు ప్రకటించింది.  


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు