మౌలికంతోనే స్థిరాస్తి వృద్ధి!

10 Mar, 2017 23:21 IST|Sakshi
మౌలికంతోనే స్థిరాస్తి వృద్ధి!

మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే ధరల్లో పెరుగుదల
అందుబాటు ధరలకు శివారు ప్రాంతాలే ఉత్తమం


భాగ్యనగరంలో స్థలం ఎక్కడ కొనాలి? ఎక్కడ కొనుగోలు చేస్తే విలువ పెరుగుతుంది? సొంతిల్లు ఎక్కడ కొంటే ఆఫీసుకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది? అసలు అందుబాటు ఇళ్లు ఎక్కడ దొరుకుతాయి? వీటన్నింటికీ ఒకటే సమాధానం మౌలిక సదుపాయాలున్న చోటే! అంటే రోడ్లు, మంచి నీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యమిస్తే చుట్టుపక్కల భూములకు విలువ పెరగడంతో పాటూ మెరుగైన రవాణాతో శివార్లకు అనుసంధానం పెరిగి సొంతింటికి చేరువవుతారు.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కొత్తగా ప్రాజెక్ట్‌ వస్తుందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. స్థిరాస్తి రంగం వృద్ధికి ఇదే ఇంధనం. ప్రభుత్వం కావొచ్చు, ప్రైవేట్‌ ప్రాజెక్ట్‌ కావొచ్చు ఏదైనా డెవలపర్లు అందిపుచ్చుకోవటంలో ముందుంటారు. వీరి మాటలు విశ్వసించి కొనుగోలు చేసినవారిలో లాభపడిన వారు, నష్టపోయిన వారూ కనిపిస్తారు. అన్ని మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లు స్థిరాస్తిపై ఒకే తరహా వృద్ధి ఉండదని గుర్తించాలని నిపుణుల సూచన. కొన్నిసార్లు కృత్రిమంగా డిమాండ్‌ సృష్టించి ధరలు పెంచి మోసం చేస్తారని ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఔటర్, మెట్రోలే బలం..
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఈ మూడు ప్రాజెక్ట్‌లే హైదరాబాద్‌ స్థిరాస్తి రంగానికి చోదక శక్తులు. సిటీ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కొన్ని కండ్లకోయ రూట్‌ మినహా పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు, విమానాశ్రయానికి సిటీ నుంచి అనుసంధానం పెరిగింది. ఇది కాకుండా ఈ ఏడాది మెట్రో రైలు కూడా అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చోదకశక్తులైన ఈ ప్రాజెక్ట్‌ల పేర్లు చెప్పే దశాబ్దకాలంగా ఇళ్లు, స్థలాలు, విల్లాలు, కార్యాలయ స్థలాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మరో దశాబ్దం కూడా వీటి చుట్టూనే స్థిరాస్తి రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని డెవలపర్లు అంటున్నారు.

కొత్త విమానాశ్రయం సహజంగా నగరం బయట ఏర్పాటు చేస్తుంటారు. శంషాబాద్‌ విమానాశ్రయం ప్రకటన మొదలు నిర్మాణం పూర్తయ్యే వరకూ ప్రతి ఏటా ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తి ధరల్లో పెరుగుదల కనిపించింది. మొదట్లో కొన్నవారు లబ్ధిపొందారు కూడా. ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో వాణిజ్య, కార్యాలయ స్థలాలకు కూడా గిరాకీ పెరిగింది. చుట్టూపక్కల ఎయిరో సెజ్‌లు ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి.

మెట్రో రైలు అభివృద్ధి చెందిన నగరం మధ్య నుంచి వెళుతుంది. ప్రస్తుతానికి రైలు పరుగులు పెట్టకముందే ఆయా కారిడార్లలో 5–10 కి.మీ. వరకు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఒక్క కూత మొదలయ్యాక ప్రధాన మార్గానికి ఇరువైపులా 2 కి.మీ. వరకూ వాణిజ్య, కార్యాలయాల స్థలాలకు డిమాండ్‌ వస్తుంది.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రకటనతో భూముల ధరలు పెరిగాయి. తక్కువ ధరలోనే స్థలాలను కొనుగోలు చేసిన వారు లబ్ధిపొందారు. ప్రభుత్వం కూడా ఔటర్‌ చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్పులను, మంచినీటి వసతులను ఏర్పాటు చేస్తోంది. దీంతో మున్నుందు అభివృద్ధి ఔటర్‌ చుట్టూనే ఉండనుంది. అందుకే తక్కువ ధరలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఓఆర్‌ఆర్‌ సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు, లాజిస్టిక్, ఈ–కామర్స్‌ సంస్థలు ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆధారం చేసుకొని కార్యకలాపాలను ప్రారంభించాయి. అంటే సమీప భవిష్యత్తులో అభివృద్ధికి ఓఆర్‌ఆర్‌ చిరునామాగా మారనుందన్నమాట.

శివార్లే బెటర్‌
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పలు అభివృద్ధి ప్రాజెక్ట్‌లు నగరం చుట్టుపక్కల వస్తున్నాయి. అయితే అవి ఎక్కడొస్తున్నాయి. పూర్తయ్యే నాటికి ఎంత కాలం పడుతుంది? వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించాకే స్థలం, ఫ్లాట్ల కొనుగోలు నిర్ణయాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరవుతుంది మరి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ ఫార్మాసిటీ, ఫిల్మ్‌ సిటీ, నిమ్జ్‌ వంటి వేర్వేరు నగరాలు రానున్నాయి.

ఓఆర్‌ఆర్‌ లోపల పలు ప్రాంతాలను కలుపుతూ గ్రిడ్‌ రోడ్లు రాబోతున్నాయి. 100 అడుగుల రోడ్లు పలు ప్రాంతాల్లో వస్తున్నాయి.
రెండో దశలో మెట్రో రైలును శివారు ప్రాంతాలకు అనుసంధానించనున్నారు.

మరిన్ని వార్తలు