విమాన ప్రయాణీకులకు శుభవార్త

6 Apr, 2018 15:17 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ప్రయాణికులకు శుభవార్త  చెప్పింది. వైమానిక ప్రమాదాలు, కాన్సిలేషన్‌ చార్జీపై  కఠినమైన నిబంధనలు అమలు చేయాలని  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.  తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై విమానాల్లో లగేజీ పోయినా, విమానాలు ఆలస్యం అయినా లేదా రద్దయినా విమానయాన సంస్థలు సదరు ప్రయాణికులకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.  దీంతో పాటు టికెట్‌ రద్దు చేసుకున్నసందర్భంలో ఎయిర్‌లైన్స్‌ బాదుడుకు చెక్‌ పెట్టేలా చర్యలు చేపట్టనుంది. తద్వారా విమాన ప్రయాణీకులకు భారీ ఉపశమనం కల్గించనుంది.

పాసెంజర్‌ చార్టర్‌లో మార్పులపై విమానయాన సంస్థలు, ఇతర పరిశ్రమ వర్గాలతో  రెండు దఫాలుగా ప్రాథమిక చర‍్చలు జరిపామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా బుధవారం పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో  రూపొందించిన తొలి  డ్రాఫ్ట్‌ను   రాబోయే పదిహేను రోజుల్లో  ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పబ్లిక్ డొమైన్‌లో పెట్టనున్నామని బుధవారం ట్వీట్‌ చేశారు.విమానాలు ఆలస్యమైన లేదా రద్దయిన సమయంలో ప్రయాణికులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని విమానయాన శాఖ ప్రతిపాదించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో పాటు విమానాల్లో పోయిన లగేజీకి కూడా ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాలని ప్రతిపాదించిందన్నారు.

ప్రస్తుతం దేశీయ విమానాల్లో లగేజీ పోయినా  లేదా దెబ్బతిన్నా గరిష్ఠంగా రూ. 20వేల వరకు చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ విమానాల్లో అయితే రూ. లక్ష వరకు పరిహారం కింద ఇస్తున్నారు. తాజాగా దీన్ని మరింత పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది.  తాజా ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఈ పరిహారం భారీగా పెరగనుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో పోయిన లగేజీకి కేజీకి రూ. 3000 వరకు చెల్లించేలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీంతోపాటు  ప్రస్తుతం కొన్ని నిర్దేశిత కారణాల వల్ల విమానాలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులకు ఆ ఎయిర్‌లైన్‌లు పరిహారం చెల్లిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కూడా పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది. కాగా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను ఇచ్చినట్లు  ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది.  మరోఎయిర్‌లైన్స్‌ విస్తారా  వ్యాఖ్యానించడానికితిరస్కరించగా ఇతర విమానయాన సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు