-

ఇలా చేస్తే.. విమానాల్లో నిషేధమే

8 Sep, 2017 14:55 IST|Sakshi
ఇలా చేస్తే.. విమానాల్లో నిషేధమే
సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణికుల భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని విమానయాన శాఖ నోఫ్లై జాబితాను శుక్రవారం విడుదల చేసింది. మూడు కేటగిరీలుగా ఈ నిషేధ జాబితాను విమానయాన శాఖ రూపొందించింది. మొదట కేటగిరీగా దురుసు ప్రవర్తనను విమానయాన శాఖ పేర్కొంది. ఇలా చేస్తే మూడు నెలల వరకు విమాన ప్రయాణాలపై నిషేధం ఉంటుంది. రెండో కేటగిరీ కింద దాడికి పాల్పడటాన్ని చేర్చింది. దీని కింద ఆరు నెలల వరకు నిషేధం విధించనుంది. మూడో కేటగిరీగా హత్యాయత్నానికి పాల్పడటాన్ని పేర్కొంది. ఈ విధమైన కేటగిరీ వారికి రెండేళ్ల వరకు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించనున్నట్టు విమానయానశాఖ తెలిపింది.
 
ఈ మార్గదర్శకాలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నట్టు పౌర విమానయాన శాఖా సహాయమంత్రి జయంత్‌ సిన్హా చెప్పారు. ప్రయాణికుల సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. మరోవైపు విమాన టిక్కెట్ల బుకింగ్‌కు కూడా కొత్త నిబంధనలను విమానయాన శాఖ అమలు చేయనుంది. టిక్కెట్ల బుకింగ్‌కోసం ఏదో ఒక ఐడీ కార్డును జతచేయడం తప్పనిసరి చేయాలని విమానయాన శాఖ భావిస్తోంది.  ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్నికల  కమిషన్‌ జారీ చేసిన ఓటర్‌ ఐడి లాంటి గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి అని జయంత్ సిన్హా తెలిపారు.