క్లారియంట్‌ భారీ డివిడెండ్‌- షేరు గెలాప్‌

13 Jul, 2020 13:32 IST|Sakshi

షేరుకి రూ. 140 ప్రత్యేక డివిడెండ్‌

16 శాతం దూసుకెళ్లిన షేరు

రికార్డ్‌ డేట్‌- ఈ నెల 18 

ఆగస్ట్‌ 20న వార్షిక సమావేశం

స్పెషాలిటీ కెమికల్‌ దిగ్గజం క్లారియంట్‌ కెమికల్స్‌ వాటాదారులకు భారీ బొనాంజా ప్రకటించింది. షేరుకి రూ. 140 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రికార్డ్‌ డేట్‌ను ఈ నెల 18గా వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో క్లారియంట్‌ షేరు దాదాపు 17 శాతం దూసుకెళ్లింది. రూ. 80 జంప్‌చేసి రూ. 565 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 575 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!

ర్యాలీ బాటలో
గత మూడు నెలలుగా గ్లోబల్‌ పేరెంట్‌ కలిగిన క్లారియంట్‌ కెమికల్స్‌ ర్యాలీ బాటలో సాగుతోంది. స్విట్లర్లాండ్‌ కంపెనీ క్లారియంట్‌ మాతృ సంస్థకాగా.. ప్రధానంగా టెక్స్‌టైల్స్‌, లెదర్‌ కెమికల్స్‌ తయారీలో పేరొందింది. గత మూడు నెలల్లో క్లారియంట్‌ షేరు 106 శాతం లాభపడింది. ఇదే సమయంలో మార్కెట్లు కేవలం 20 శాతం పుంజుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఈ కౌంటర్‌కు మరింత బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 71 కోట్లను తాకింది. అంతక్రితం(2018-19)లో రూ. 30 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 5 శాతం పెరిగి 757 కోట్లను తాకింది. అత్యంత నాణ్యమైన ప్రొడక్టులతో మార్కెట్లో మరింత విస్తరించడం ద్వారా కంపెనీ పటిష్ట పనితీరు చూపినట్లు క్లారియంట్‌ యాజమాన్యం ఫలితాల సందర్భంగా పేర్కొంది. దీంతో క్యాష్‌ఫ్లో బాగా మెరుగుపడినట్లు వెల్లడించింది. కాగా.. ముందుగా అనుకున్నట్లు ఆగస్ట్‌ 13న కాకుండా 20న కంపెనీ 63వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని(ఏజీఎం) నిర్వహించనున్నట్లు క్లారియంట్‌ తాజాగా పేర్కొంది.

మరిన్ని వార్తలు