మూడు నెలల్లో బాకీలు కట్టేయాల్సిందే

14 Nov, 2019 05:53 IST|Sakshi

టెల్కోలకు టెలికం శాఖ నోటీసులు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లోగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తదితర బాకీలన్నీ కట్టేయాలంటూ టెల్కోలకు టెలికం శాఖ(డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. స్వయం మదింపు ప్రాతిపదికన బకాయిలను తీర్చవచ్చంటూ నోటీసుల్లో పేర్కొన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లైసెన్సు ఫీజు మొదలైన వాటికి ప్రాతిపదిక అయిన ఏజీఆర్‌ను (సవరించిన స్థూల ఆదాయం) లెక్కించే ఫార్ములా విషయంలో.. ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు అక్టోబర్‌ 24న తీర్పు ఇవ్వడం తెలిసిందే.

దీని ప్రకారం 3 నెలల్లోగా వడ్డీ సహా బాకీలు చెల్లించాలంటూ టెల్కోలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. డాట్‌ అంతర్గతంగా వేసిన లెక్కల ప్రకారం టెల్కోల నుంచి రూ. 1.33 లక్షల కోట్ల దాకా వసూలు కావాల్సి ఉంది.  ఎయిర్‌టెల్‌ అత్యధికంగా రూ. 62,188 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 54,184 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఎంటీఎన్‌ఎల్‌ రూ. 10,675 కోట్లు బాకీ పడ్డాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ.. ఈ బాకీల చెల్లింపులతో మరింత సంక్షోభంలోకి జారిపోతుందని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు