క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఫండ్స్‌...

18 Dec, 2017 01:43 IST|Sakshi

రాబడుల పంట? రాబడితో పాటు రిస్క్‌ కూడా ఎక్కువే

మొత్తం పెట్టుబడులు 20–25 స్టాక్స్‌లోనే

గడువు వరకూ వేచి ఉంటే అధిక రాబడి

ఎన్‌ఎఫ్‌వో సమయంలోనే ఇన్వెస్ట్‌ చేసే అవకాశం

తరవాత ఎక్సే్ఛంజీల్లో లిస్టింగ్‌; క్రయవిక్రయాలు

ఓపెన్‌ ఎండెడ్‌ యూనిట్లయితే ఎప్పుడైనా కొనొచ్చు

కావాల్సినపుడు సదరు సంస్థకే విక్రయించొచ్చు  

స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల కొత్త ఇన్వెస్టర్లలోనూ ఆసక్తి ఏర్పడుతోంది. సాధారణంగా విశ్లేషకులు సూచించేవన్నీ ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ కిందకు వస్తాయి. అంటే వీటిలో ఎప్పుడైనా పెట్టుబడి పెట్టొచ్చన్న మాట. కానీ, ఇవి కాకుండా క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. వీటిలో పెట్టుబడికి ఒక్కసారి మాత్రమే అవకాశం వస్తుంది. అది కూడా ఫండ్‌ సంస్థలు వీటిని ఆరంభిస్తూ విక్రయించినపుడే. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ పథకాలతో పోలిస్తే ఇవి చాలా భిన్నమైనవి. వీటిలో ఇన్వెస్ట్‌ చేస్తే వచ్చే ప్రతిఫలం ఎక్కువే ఉంటుంది. అలాగే రిస్క్‌ కూడా ఎక్కువే. కాబట్టి ఈ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసే ముందు చూడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం..

అందుబాటు... కొనుగోలు, అమ్మకాలు
క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ అన్నవి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఇన్వెస్టర్లకు ఒక్కసారి విక్రయించేవి మాత్రమే. నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) కాలంలోనే వీటిని విక్రయిస్తాయి. ఆఫర్‌ ముగిసిన తర్వాత వీటిని స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్‌ చేస్తారు. దీంతో షేర్ల మాదిరిగా ట్రేడింగ్‌ చేసుకోవచ్చు.

అప్పుడు వీటిని ఎక్సే్ఛంజీల ద్వారా కొనుక్కోవచ్చు కూడా. అదే ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ అయితే, ఫండ్‌ నిర్వహణ సంస్థ (ఏఎంసీ) ఇన్వెస్టర్ల డిమాండ్‌ మేరకు ఎన్ని యూనిట్లనయినా విక్రయించగలదు. ఇన్వెస్టర్లు కూడా తమకు అవసరమైనప్పుడు, పెట్టుబడులను వెనక్కి తీసుకోదలిస్తే తమదగ్గరున్న యూనిట్లను సదరు ఫండ్‌ సంస్థకు విక్రయించి మార్కెట్‌ ధర ఆధారంగా డబ్బులు వెనక్కు పొందొచ్చు. ఓపెన్‌ ఎండెడ్‌ పథకాల యూనిట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్‌ కావు. ఫండ్‌ హౌస్‌ ద్వారానే కొనుగోలు, అమ్మకాలు చేయాల్సి ఉంటుంది.

పెట్టుబడుల తీరు ఇదీ..
క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఫండ్స్, ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ పెట్టుబడుల తీరు భిన్నంగా ఉంటుంది. క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాల్లో ఫండ్‌ మేనేజర్లు సాధారణంగా 20–25 షేర్లలోనే తమ పెట్టుబడులన్నీ పెడతారు. వీటిలో టాప్‌ 5–10 స్టాక్స్‌లో పెట్టుబడులే 45–55 శాతం వాటా కలిగి ఉంటాయి. డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో విధానం కంటే ఇది భిన్నం.

డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో స్ట్రాటజీలో ఫండ్‌ మేనేజర్లు 40–50 స్టాక్స్‌ను ఎంచుకుంటారు. ఒక స్టాక్‌కు కేటాయింపులు 10 శాతం మించి ఉండవు. సాధారణంగా ఎక్కువ శాతం క్లోజ్డ్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు మూడేళ్ల కాల వ్యవధితో ఉంటాయి. డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ అన్నది తక్కువగా ఉంటుంది. కానీ, క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాల్లో ఈ విధానం ఉండదు. సెబీ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏ ఫండ్‌ అయినా కానీ, ఒక స్టాక్‌లో మొత్తం పోర్ట్‌ఫోలియో నిధిలో 10 శాతం మించి ఇన్వెస్ట్‌ చేసేందుకు అవకాశం లేదు.

రిస్క్‌ కాస్త ఎక్కువే!
క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాల్లో మరో ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ స్ట్రాటజీ కూడా ఉంది. అదేమిటంటే ఫండ్‌ మేనేజర్‌ కొన్ని రంగాలకు చెందిన షేర్లను భారీగా కొనుగోలు చేయడం. దీంతో ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో ఈ రంగాల వాటా ఇతర రంగాలతో పోలిస్తే చాలా అధికంగా ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు చెందిన నిపుణుల అభిప్రాయం ప్రకారం క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాలకు కేంద్రీకృత ఇన్వెస్ట్‌మెంట్‌ విధానం చక్కగా పనిచేస్తుంది.

ఈ విధానంలో ఫండ్‌ మేనేజర్లు అధిక నమ్మకంతో ఎంచుకునే షేర్లు పథకం కాల వ్యవధి ముగిసే నాటికి మంచి రాబడులను ఇచ్చేవిగా ఉంటాయి. దీంతో ఈ విధానంలో ఫండ్‌ మేనేజర్లు కాల వ్యవధి ముగిసే వరకు పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని విక్రయించాల్సిన అవసరం ఏర్పడదు. దీంతో డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే కేంద్రీకృత పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ మెరుగైన రాబడులు ఇస్తాయి. అయితే, ఈ విధమైన కేంద్రీకృత పోర్ట్‌ఫోలియో విధానంలో అధిక రిస్క్‌ ఉంటుందని ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ పరిమితం చేసేలా పెట్టుబడుల విధానం ఉంటుంది.

లిక్విడిటీ కొంచెం తక్కువ...
క్లోజ్డ్‌ ఎండెడ్, ఓపెన్‌ ఎండెడ్‌ పథకాలను ఎంచుకునే ముందు ఇన్వెస్టర్లు చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం లిక్విడిటీ. క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాల యూనిట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్‌ అయినప్పటికీ లిక్విడిటీ చాలా తక్కువ అనేది ఈ రంగ నిపుణుల అభిప్రాయం. కనుక వీటిని ఎంచుకునే వారు ఆ పథకం కాల వ్యవధి ముగిసే వరకు పెట్టుబడులను కొనసాగించేందుకు మానసికంగా సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. అదే ఓపెన్‌ ఎండెడ్‌ పథకాల్లో ఈ సమస్య ఉండదు. నేరుగా ఫండ్‌ సంస్థలే కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటాయి.

మరిన్ని వార్తలు