కొత్త రికార్డు స్థాయి నుంచి క్షీణత

7 Jun, 2017 01:01 IST|Sakshi
కొత్త రికార్డు స్థాయి నుంచి క్షీణత

సెన్సెక్స్‌ 119 పాయింట్లు,
నిఫ్టీ 38 పాయింట్లు డౌన్‌


ముంబై: మంగళవారం వరుసగా మూడోరోజు కూడా సూచీలు కొత్త రికార్డుస్థాయికి చేరినతర్వాత కొన్ని రంగాల షేర్లలో అమ్మకాలు జరగడంతో ముగింపులో క్షీణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 31,430 పాయింట్ల కొత్త గరిష్టానికి చేరిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 119 పాయింట్ల తగ్గుదలతో 31,190 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో 9,700 పాయింట్ల శిఖరాన్ని తాకిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తదుపరి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. చివరకు 38 పాయిం ట్ల క్షీణతతో 9,637 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ పరపతి విధాన నిర్ణయం వెల్లడికానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో వడ్డీ రేట్లతో ప్రభా వితమయ్యే బ్యాంకింగ్, ఆటో, ఇన్‌ఫ్రా షేర్లతో పాటు ఆయిల్‌ గ్యాస్‌ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలు గరిష్టస్థాయి వద్ద స్థిరపడలేకపోయాయి. యూరో పరిణామాలు కూడా  ఇన్వెస్టర్ల జోరుకు బ్రేకులు వేసాయని విశ్లేషకులు చెప్పారు.

టాటా మోటార్స్‌ 3.5 శాతం డౌన్‌...
సెన్సెక్స్‌–30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టాటా మోటార్స్‌ 3.58% నష్టపోయింది. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఐటీసీలు 2 శాతంపైగా క్షీణించగా, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా 1%పైగా నష్టపోయాయి.

ట్రెండ్‌కు ఎదురునిల్చిన ఐటీ షేర్లు...
మార్కెట్లో బలహీనమైన ట్రెండ్‌ నెలకొన్నప్పటికీ, ఐటీ షేర్లు మాత్రం జోరుగా పెరిగాయి. టీసీఎస్‌ 3.63 శాతం జంప్‌చేసి రూ. 2,696 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్‌ 2 శాతం మేర ర్యాలీ జరిపి రూ. 981 స్థాయికి చేరింది. విప్రో 91 శాతం పెరిగింది.  హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.3% పెరిగింది.

>
మరిన్ని వార్తలు