అన్‌లాక్‌ 2.0 : దిగిరాని నిరుద్యోగ రేటు

8 Jul, 2020 14:04 IST|Sakshi

సీఎంఐఈ గణాంకాలు

ముంబై : కరోనా కట్టడికి విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్‌ దశ ప్రారంభమైనా దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు ఇంకా అధికంగానే ఉందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. లాక్‌డౌన్‌ సడలింపులతో ఈ ఏడాది మేలో 23.5 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 11 శాతానికి పడిపోయిందని అయితే ఇది ఇంకా అధికమేనని సీఎంఐఈ సీఈఓ మహేష్‌ వ్యాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌కు ముందు నిరుద్యోగ రేటు 8 శాతం కంటే తక్కువగా ఉందని గుర్తుచేశారు.

2017-18లో 4.6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2018-19లో 6.3 శాతం, 2019-20లో 7.6 శాతానికి ఎగబాకింది. నిరుద్యోగ రేటు పెరుగుతూ వస్తున్నా జూన్‌లో ఇది 11 శాతంగా నమోదవడం అత్యధికమని వ్యాస్‌ పేర్కొన్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించడంతో జూన్‌లో నిరుద్యోగ రేటు భారీగా తగ్గిందని, కార్మిక భాగస్వామ్య రేటు పెరగడంతోనే ఇది సాధ్యమైందని వ్యాస్‌ చెప్పుకొచ్చారు.జులైలో మరికొన్ని ఉద్యోగాలు అదనంగా సమకూరనుండటంతో నిరుద్యోగ రేటు మరికొంత దిగివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

చదవండి : నిరుద్యోగ భారతం

మరిన్ని వార్తలు