ఉద్యోగార్ధులకు గుడ్‌న్యూస్‌..

30 Oct, 2019 16:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాంద్య మేఘాలు ముసురుకోవడంతో అన్ని రంగాలూ కుదేలై ఉద్యోగాలు కోల్పోతున్న వేళ ఓ నివేదిక యువతలో ఉత్తేజం నింపుతోంది. మందగమనం తాత్కాలికమేనని మళ్లీ కొలువుల కోలాహలం నెలకొంటుందనే ఆశను రేకెత్తించింది. ఈ ఏడాది మే -ఆగస్ట్‌లో దేశవ్యాప్తంగా 40.49 కోట్ల మంది ఉపాధి రంగంలో ఉన్నారని సీఎంఐఈ సర్వే వెల్లడించినట్టు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో 40.24 కోట్ల మంది వివిధ వృత్తి, ఉద్యోగాల్లో కుదురుకున్నారని, ఈ ఏడాది 25 లక్షల మంది అదనంగా శ్రామిక శక్తికి తోడయ్యారని ఈ సర్వే నివేదిక తెలిపింది.

అంతకుముందు రెండేళ్లుగా ఉపాధి పొందే వారి సంఖ్య తగ్గుముఖం పట్టగా తాజాగా పనిచేసే వారి సంఖ్య 25 లక్షల మేర పెరగడం మెరుగైన సంకేతాలు పంపుతోందని సీఎంఐఈ సీఈఓ మహేష్‌ వ్యాస్‌ పేర్కొన్నారు.ఈ ఏడాది మే-ఆగస్ట్‌లో తాము నిర్వహించిన సర్వేలో వ్యవసాయ రంగం, అనుబంధ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య 84 లక్షల మేర పెరిగినట్టు వెల్లడైందని, అయితే ఐటీ, ఆర్థిక సేవల రంగాల్లో ఉద్యోగాల సంఖ్య ఆశాజనకంగా లేదని ఆయన పెదవివిరిచారు. వ్యవసాయ రంగంలో ఈసారి పంట సాగుబడి అధికంగా ఉండటంతో ఈ రంగంలో ఉపాధి 13 కోట్ల నుంచి 14 కోట్లకు పెరిగిందని..కోళ్ల పెంపకం, పశుసంవర్ధక రంగంలో ఉపాథి 18 లక్షల నుంచి 43 లక్షలకు పెరిగిందని తెలిపారు.

మరోవైపు తయారీ రంగంలో ఉద్యోగాలు గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే 9 లక్షలు, జౌళి రంగంలో 22 లక్షల మేర ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఐటీ, ఆర్థిక సేవల రంగాల్లో ఉపాధి వృద్ధి ఆశించిన మేర లేదని ఈ సర్వే తెలిపింది. మొత్తంమీద తక్కువ నైపుణ్యం కలిగిన రంగాల్లో ఉపాధి అధికమవడం గమనార్హం. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు గ్రామీణ రంగంలో ఉపాధి పెరగడం ఎకానమీ ఎదుగుదలకు ఎంతమేర తోడ్పడుతుందనేది వేచిచూడాలి. వ్యవసాయేతర రంగాల్లోనూ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరిగితేనే మందగమన ప్రభావాన్ని దీటుగా తిప్పిగొట్టగలమని నిపుణులు పేర్కొంటున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా