కో వర్కింగ్‌... ఇపుడిదే కింగ్‌!!

6 Sep, 2019 09:18 IST|Sakshi

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: తక్కువ బడ్జెట్లో కంపెనీని ఏర్పాటు చేశారా? అయినప్పటికీ అన్ని సౌకర్యాలతో ట్రెండీ ఆఫీస్‌ కావాలా? మీలాంటి వారికి కో-వర్కింగ్‌ స్పేస్‌ చక్కని పరిష్కారం. స్టార్టప్స్‌ మాత్రమే కాదు, పెద్ద కంపెనీల కార్యకలాపాలకూ ఇవి చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి. ఉద్యోగుల్లో 46 శాతం మిలీనియల్స్‌ కావడం.. వీరు టెక్‌ స్మార్ట్‌ ఆఫీసులను కోరుకుంటుండడంతో భారత్‌లో ఇప్పుడు కో-వర్కింగ్‌ స్పేస్‌ ట్రెండ్‌ ఊపందుకుంది. స్టార్టప్స్‌, చిన్న, మధ్యతరహా కంపెనీలు అందుబాటు ధరలో లభించే అద్దె కార్యాలయాల వైపు మొగ్గు చూపడం, అలాగే కార్పొరేట్‌ కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణకు వీటిని వేదికలుగా చేసుకుంటున్నాయి. భాగ్యనగరిలోనూ కో-వర్కింగ్‌ కల్చర్‌ ఊపందుకుంది. హైదరాబాద్‌లో దాదాపు 70 కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి.

గంటల వ్యవధి కోసం సైతం..
అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలను బట్టి చార్జీలు ఉంటాయి. సీటింగ్‌, కంప్యూటర్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌, కెఫెటేరియా, జిమ్‌, లైబ్రరీ, ప్లే ఏరియా, గేమింగ్‌ జోన్‌, మీటింగ్‌ రూమ్స్‌, రిక్రియేషనల్‌ స్పేస్‌, కాంప్లిమెంటరీ టీ/కాఫీ, ప్రింటర్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ వంటి హంగులనుబట్టి చార్జీలు ఆధారపడతాయి. గంటల వ్యవధి కోసం సైతం కో-వర్కింగ్‌ స్పేస్‌ను వాడుకోవచ్చు. రోజుకు రూ.500 చార్జీ చేస్తున్న కంపెనీలూ ఉన్నాయి. అలాగే నెలకు డెస్క్‌ వాడుకున్నందుకు కనీస చార్జీ రూ.5 వేలు ఉంటోంది. లీజుకు కార్యాలయాన్ని తీసుకోవడం, సౌకర్యాల కోసం ముందస్తు పెట్టుబడి పెట్టే అవసరం లేకపోవడం కంపెనీలకు కలిసి వచ్చే అంశం. పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అద్దె కార్యాలయంలోకి ఎప్పుడైనా ఎంట్రీ, ఎగ్జిట్‌ అవొచ్చు. మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, స్టార్‌బక్స్‌, ఏటీఅండ్‌టీ వంటి దిగ్గజ సంస్థలూ కో-వర్కింగ్‌ స్పేస్‌ లొకేషన్లలో కార్యాలయాలను సాగిస్తుండడం విశేషం. 

పోటీపడుతున్న కంపెనీలు..
వీవర్క్‌, 91స్ప్రింగ్‌బోర్డ్‌, గోహైవ్‌, గోవర్క్‌, ఆఫిస్‌, ఐస్ప్రౌట్‌.. ఇలా దేశంలో 300లకుపైగా కంపెనీలు ఈ రంగంలో పోటీపడుతున్నాయి. విభిన్న సేవలతో క్లయింట్లను ఆకర్శించడమే కాదు, విస్తరణలోనూ నువ్వా నేనా అని అంటున్నాయి. చిన్న నగరాల్లోనూ అడుగుపెడుతున్నాయి. ఈ రంగంలో 2020 నాటికి రూ.2,800 కోట్ల పెట్టుబడులు రావొచ్చని మైహెచ్‌క్యూ అంచనా వేస్తోంది. అలాగే కో-వర్కింగ్‌ కేంద్రాల్లో వివిధ కంపెనీలకు చెందిన 1.3 కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తారని జోస్యం చెబుతోంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, కోల్‌కత, ముంబై, పుణే నగరాల్లో వర్క్‌స్పేస్‌ ఆపరేటర్లు 2019లో 88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని లీజుకు తీసుకుంటారని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ చెబుతోంది. అందుబాటులో ఉన్న ఆఫీస్‌ స్పేస్‌లో వర్క్‌స్పేస్‌ కంపెనీలు తీసుకునే లీజు స్థలం 18-20 శాతముంటుందట. 2018లో ఇది 14 శాతం వాటాతో 68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కైవసం చేసుకున్నాయి. సంప్రదాయ లీజు విధానంతో పోలిస్తే రెండేళ్లలో కో-వర్కింగ్‌ స్పేస్‌ వాటాయే అధికంగా ఉంటుందని ఐస్ప్రౌట్‌ సీఈవో సుందరి పాటిబండ్ల సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు.

న్సాలిడేషన్‌ దిశగా..
ఈ రంగంలో కన్సాలిడేషన్‌ వచ్చే ఏడాది నుంచి జరుగుతుందని కొలియర్స్‌ అంటోంది. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన పెద్ద కంపెనీలు ఈ రంగంలోని చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తాయి. ఇప్పటికే ఇన్నోవ్‌-8ను జూలైలో ఓయో దక్కించుకుంది. కన్సాలిడేషన్‌తో విభిన్న ధరల శ్రేణిలో క్లయింట్లకు సేవలు అందించేందుకు పెద్ద సంస్థలకు వీలవుతుంది. ప్రస్తుతం ఈ రంగ కంపెనీల చేతుల్లో మొత్తం 1.7 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం ఉంది. కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో ఇది 3.5 శాతం. క్లయింట్ల నుంచి డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతుండడంతో కంపెనీలు భారీ భవంతులను లీజుకు తీసుకుని వర్క్‌స్పేస్‌ సైట్లుగా తీర్చిదిద్దుతున్నాయి. వర్క్‌స్పేస్‌ సైట్ల సగటు విస్తీర్ణం రెండేళ్లలో 40 శాతం అధికమై 55,000 చదరపు అడుగులకు చేరుకుంది. ఓయో వర్క్‌స్పేసెస్‌ ఇటీవలే హైదరాబాద్‌లో 700 సీట్లకుపైగా సామర్థ్యమున్న కేంద్రాన్ని ప్రారంభించింది.

మరిన్ని వార్తలు