కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఈ వారంలో నిర్ణయం!

1 Sep, 2014 00:27 IST|Sakshi
కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఈ వారంలో నిర్ణయం!

న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 10 శాతం వాటా విక్రయం ప్రతిపాదనకు ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్రవేసే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో కంపెనీ డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఓకే చెప్పవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలో కేంద్రానికి 89.65 శాతం వాటా ఉంది.
 
గురువారంనాటి షేరు ముగింపు ధర(రూ.356) ప్రకారం చూస్తే 10 శాతం వాటా(63.16 కోట్ల షేర్లు) అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.22,428 కోట్లు లభించవచ్చని అంచనా. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న రూ.43,425 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ మొత్తంలో ఒక్క కోల్ ఇండియా వాటా విక్రయం ద్వారానే సగానికిపైగా ఖజానాకు సమకూరనుండటం గమనార్హం.
 
ఓఎఫ్‌ఎస్‌లలో రిటైలర్లకు 20% కోటా: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల వాటా అమ్మకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత భాగస్వామ్యం కల్పించేందుకు ఆర్థిక శాఖ లైన్‌క్లియర్ చేసింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) రూట్‌లో షేర్ల విక్రయంలో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల కోటాను 20 శాతానికి పెంచినట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భవిష్యత్తులో చేపట్టే పీఎస్‌యూ డిజిన్వెస్ట్‌మెంట్‌లకు దీన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు