కోల్‌ ఇండియా లాభం 52% డౌన్‌

30 May, 2018 01:38 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద మైనింగ్‌ కంపెనీ కోల్‌ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్‌) జనవరి – మార్చి క్వార్టర్‌లో 52 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.2,719 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో రూ.1,295 కోట్లకు తగ్గిందని కోల్‌ ఇండియా తెలిపింది. ఆదాయం మాత్రం రూ.26,634 కోట్ల నుంచి రూ.28,909 కోట్లకు పెరిగింది.

వ్యయాలు రూ.22,353 కోట్ల నుంచి  రూ.27,757 కోట్లకు చేరాయి. ఉద్యోగుల ప్రయోజనాల వ్యయాలు రూ.9,241 కోట్ల నుంచి రూ.16,654 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్థూల అమ్మకాలు 6 శాతం వృద్ధితో రూ.37,495 కోట్లకు పెరిగాయని వివరించింది. నిర్వహణ లాభం రూ.3,461 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ.196 కోట్లకు తగ్గిందని తెలిపింది. నిర్వహణ లాభ మార్జిన్‌ 0.7 శాతం తగ్గి 14.9 శాతానికి పడిపోయింది.

గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున గత ఆర్థిక సంవత్సరం, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరాల ఆదాయం, మొత్తం వ్యయాలను పోల్చడానికి లేదని కంపెనీ వివరించింది. గత ఏడాది మార్చి నాటికి 554 మిలియన్‌ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది మార్చి నాటికి 567 మిలియన్‌ టన్నులకు పెరిగిందని  కోల్‌ ఇండియా పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 630 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితాల నేపథ్యంలో కోల్‌ ఇండియా షేర్‌ 1% నష్టంతో రూ.282 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు