కోల్‌ ఇండియా లాభం ఎనిమిది రెట్లు

13 Nov, 2018 00:20 IST|Sakshi

సీక్వెన్షియల్‌గా 18 శాతం క్షీణత

రూ.24,209 కోట్లకు ఆదాయం  

న్యూఢిల్లీ: కోల్‌ ఇండియా నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో ఎనిమిది రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.370 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.3,085 కోట్లకు పెరిగిందని కోల్‌ ఇండియా తెలిపింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.3,786 కోట్ల నికర లాభం వచ్చిందని, సీక్వెన్షియల్‌గా చూస్తే, 18 శాతం క్షీణత నమోదైందని తెలిపింది.

మొత్తం ఆదాయం రూ.19,172 కోట్ల నుంచి రూ.24,209 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.18,148 కోట్ల నుంచి రూ.19,092 కోట్లకు పెరిగాయని వివరించింది. బొగ్గు ఉత్పత్తి గత క్యూ2లో 110 మిలియన్‌ టన్నులుగా ఉండగా, ఈ క్యూ2లో 120 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కోల్‌ ఇండియా షేర్‌ 1.5 శాతం పతనమై రూ.264 వద్ద ముగిసింది.

కోల్‌ ఇండియా ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొనకండి
ఉద్యోగులకు కార్మిక సంఘాల పిలుపు  
కోల్‌ ఇండియాలో వాటా విక్రయాన్ని బొగ్గు రంగ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 5 శాతం వాటాను కోల్‌ ఇండియా ఉద్యోగులకు కేంద్రం ఆఫర్‌ చేస్తోంది.  ఒక్కో షేర్‌ను రూ.254.22 ధరకు మొత్తం 99 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఈ ఓఎఫ్‌ఎస్‌ ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది.

ఈ వాటా విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నామని సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘం ఆల్‌ ఇండియా కోల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి బి.బి. రామధంధన్‌ చెప్పారు. ఈ ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొనవద్దని, ఉద్యోగులెవరూ షేర్లను కొనుగోలు చేయవద్దని ఆయన కోరారు. ఇటీవలనే కోల్‌ ఇండియాలో ప్రభుత్వం 3.19 శాతం వాటాను విక్రయించింది. కాగా 2010లో ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడు రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రాగా, ఉద్యోగుల నుంచి అంతంత మాత్రం స్పందనే వచ్చింది.

మరిన్ని వార్తలు