కోల్ ఇండియా లాభం 14 శాతం డౌన్

14 Sep, 2016 00:27 IST|Sakshi
కోల్ ఇండియా లాభం 14 శాతం డౌన్

న్యూఢిల్లీ: కోల్ ఇండియా నికర లాభం (కన్సాలిడేట్) జూన్‌తో ముగిసిన క్యూ1లో 14.7 శాతం తగ్గుదలతో రూ.3,065 కోట్లకు క్షీణించింది. అమ్మకాల్లో తగ్గుదలే నికర లాభం క్షీణతకు ప్రధాన కారణం. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.3,597 కోట్ల కన్సాలిడేట్ నికర లాభాన్ని ప్రకటించింది. ఇక ఈ క్యూ1లో కంపెనీ నికర అమ్మకాలు 6 శాతం క్షీణతతో రూ.17,796 కోట్లకు తగ్గాయి. కాగా కంపెనీ మొత్తం వ్యయాలు రూ.14,834 కోట్లకు తగ్గాయి. గత క్యూ1లో కంపెనీ వ్యయాలు రూ.15,321 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ1లో 121 మిలియన్ టన్నులుగా ఉన్న కంపెనీ ఉత్పత్తి ఈ క్యూ1లో 4 శాతం వృద్ధితో 126 మిలియన్ టన్నులకు ఎగసింది.

స్టాండలోన్ ప్రాతిపదికన చూస్తే.. కంపెనీ నికర లాభం రూ.487 కోట్ల నుంచి రూ.4 కోట్లకు తగ్గింది. నికర అమ్మకాలు రూ.37 కోట్ల నుంచి రూ.23 కోట్లకు పడ్డాయి. గత త్రైమాసికంలో అనుబంధ కంపెనీలు డివిడెండు చెల్లించని కారణంగా మాతృ కంపెనీ అయిన కోల్ ఇండియాకు ఆదాయం పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 598 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 80 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు