చాకొలేట్ ధరలకు రెక్కలు..!

3 Oct, 2014 00:26 IST|Sakshi
చాకొలేట్ ధరలకు రెక్కలు..!

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చాకొలేట్ ప్రియులకు చేదువార్త. చాకొలేట్ తయారీలో వినియోగించే ప్రధాన ముడిసరుకు కోకో సరఫరాలకు విఘాతం ఏర్పడటంతో  సమీప భవిష్యత్తులో చాకొలేట్ ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో కోకోను అధికంగా ఉత్పత్తిచేసే ఆఫ్రికా దేశాల్లో   ఎబోలా వైరస్ వ్యాపించిన కారణంగా చాకొలేట్ ముడి సరుకు సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

దాంతో అంతర్జాతీయ మార్కెట్లో కోకో ధర ఇటీవలకాలంలో రికార్డు గరిష్టస్థాయికి చేరింది. కోకో ఉత్పత్తి పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్, ఘనా దేశాల నుండే వస్తోంది. ప్రపంచంలోని మొత్తం కోకో ఉత్పత్తిలో 70 శాతం వాటా ఈ రెండు దేశాలదే.  ఈ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాపించినందున, ఉత్పత్తి క్షీణిస్తుందని, ఆ ప్రభావం చాకొలేట్ ధరలపై పడుతుందని  శాంప్రే న్యూట్రిషన్ చైర్మన్ గుర్బానీ సాక్షి ప్రతినిధికి చెప్పారు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో కోకో టన్ను ధర దాదాపు రికార్డు గరిష్టస్థాయి 3,723 డాలర్లకు (రూ. 2, 23,380) చేరింది.

ఎబోలా వైరస్ ప్రభావంతో కోకో సరఫరా సమస్యలు ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు ధరలు 100 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఐవరీ కోస్ట్, ఘనా దేశాల నుండి సరఫరా అయ్యే కోకో నాణ్యతలో ఎంతో మెరుగైనదని, మిగతా ఏ దేశాల నుండీ ఆ స్థాయి నాణ్యతకల ఉత్పత్తి దిగుమతి చేసుకోవడం సాధ్యపడదని గుర్బానీ చెప్పారు.  అంతర్జాతీయ సంస్థలైన క్యాడ్‌బరీ, నెస్లే, పర్‌ఫెట్టీలాంటి సంస్థలకు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా చాకొలేట్లు ఉత్పత్తి చేస్తున్న శాంప్రే సంస్థ జస్ట్‌కాఫీ, క్యాండీ న్యూట్రీ, ఎక్లైర్స్ లాంటి స్వంత బ్రాండులనూ మార్కెట్ చేస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా చేతినిండా ఆర్డర్లున్నాయని, మూడు షిప్టుల్లో ఉత్పత్తి చేస్తున్నామని గుర్బానీ చెప్పారు.

2014 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సారానికి సంస్థ రూ. 3.76 కోట్ల విలువైన ముడిసరుకు వినియోగించింది. అంత క్రితం సంవత్సరం ముడి సరుకు వినియోగం రూ. 1. 1 కోటిగా నమోదైంది.  తాజా పరిణామాలతో ముడి సరుకు ధరలు పెరిగితే శాంప్రే లాంటి సంస్థలు ముడి సరుకు కొనుగోలుపై అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది. కోకో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడ్డ హైదరాబాద్‌కు చెందిన మరో చాక్‌లెట్ తయారీ సంస్థ లోటస్ చాక్‌లెట్ లిమిటెడ్.

 కోకోను పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు చాకొలేట్ తయారీలోనూ వినియోగిస్తోంది. కోకో మాస్, పౌడర్, బట్టర్, చాక్‌లెట్, ప్లైన్ చాకోపేస్ట్, క్రీం కవరింగ్స్, డ్రింకింగ్ చాక్‌లెట్, సాస్ లాంటి ఉత్పత్తులను తయారుచేస్తోంది. 2012-13లో సంస్థ రూ 33 కోట్లు ముడిసరుకును వినియోగించగా 2013-13 ఆర్థిక సంవత్సరానికి అది రూ. 43 కోట్లుకు పెరిగింది.

  కోకో ఉత్పిత్తి -సరఫరా..
 ప్రపంచ వ్యాప్తంగా ఏటా 3.5 మిలియన్ టన్నుల కోకో ఉత్పత్తి అవుతోంది. చైనా, ఇండియా, అమెరికా దేశాల్లో సంపన్న వర్గాల ఆదాయం పెరుగుతుండటంతో కోకో వినియోగం 2020 నాటికి 4.5 మిలియన్ టన్నులకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోకో ధరలపై వాతావరణం, చీడపీడలు, ఉత్పాదక దేశాల్లో రాజ కీయ స్థిరత్వం వంటి అంశాలు ప్రభావం చూపుతుంటాయి. ఐవ రీ కోస్ట్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా 2011లో కోకో టన్ను ధర అత్యధికంగా 3,775 డాలర్లు (రూ. 1, 88, 750) పలికింది. డాలర్ల రూపేణా అప్పటి ధరకు మరో 50 డాలర్ల తక్కువగా ఇప్పటి ధర వున్నప్పటికీ, రూపాయి క్షీణించిన ప్రభావంతో భారత్ దిగుమతిదారులు ప్రస్తుతం టన్నుకు రూ. 2.23 లక్షలు వెచ్చించాల్సివస్తోంది.

 అధిక బరువు కోకోవాదే...
 చాకొలేట్ తయారీలో కోకోవాతో పాటు నట్స్, జామ్, ప్రూట్‌లను వాడుతారు. అయితో చాక్‌లెట్ మొత్తం బరువులో 25 శాతం బరువు కోకోదే. ఇక డార్క్ చాకొలెట్లయితే70 నుండి 80 శాతం చాక్‌లెట్  బరువు కోకోదే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డార్క్ చాకొలేట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

మరిన్ని వార్తలు