బ్లాక్‌ స్టోన్‌ చేతికి కాఫీ డే గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌

18 Sep, 2019 05:32 IST|Sakshi

డీల్‌ విలువ రూ.2,700 కోట్లు

న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ను రూ.2,700 కోట్లకు విక్రయించింది. ఈ ప్రొపర్టీని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ బ్లాక్‌స్టోన్, రియల్టీ సంస్థ సలర్‌పూరియా సత్వలకు విక్రయించామని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఈ మేరకు సదరు సంస్థలతో నిశ్చయాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నామని పేర్కొంది. తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించడానికి, రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ప్రాపర్టీని విక్రయించామని వివరించింది. ఈ డీల్‌ వచ్చే నెల 31లోపు పూర్తవ్వగలదని అంచనా. ప్రమోటర్‌ సిద్దార్థ ఆత్మహత్య తర్వాత రుణ భారం తగ్గించుకునే చర్యల్లో భాగంగా కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ఆస్తులను విక్రయిస్తోంది. పోర్ట్‌ టర్మినల్స్, కంటైనర్‌ ప్రైయిట్‌ స్టేషన్స్‌ నిర్వహించే తన అనుబంధ సంస్థ, సికాల్‌ లాజిస్టిక్స్‌ రుణ భారం తగ్గించుకోవడంపై కూడా కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ దృష్టి పెట్టింది. సికాల్‌ లాజిస్టిక్స్‌ బహిర్గత రుణాలు రూ.1,488 కోట్ల మేర ఉంటాయని గత వారమే ఈ కంపెనీ ప్రకటించింది.  

►గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.72.75 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు