కాగ్నిజెంట్‌ ఇండియా సీఎండీ రాజీనామా

11 Jul, 2020 16:58 IST|Sakshi

అదేబాటలో గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే

కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్ట్‌ రామ్‌కుమార్‌ రామ్మూర్తి తన పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయం సీఈవో బ్రియాన్ హంప్రీస్ శుక్రవారం వెల్లడించారు. కాగ్నిజెంట్ ఇండియా కంపెనీలో రామ్మూర్తి సుమారు 23 ఏళ్లపాటు పనిచేశారు. ఈయన 2019లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి వందలాది మంది సీనియర్ ఉద్యోగులు కాగ్నిజెంట్‌ నుంచి వైదొలిగారు. ఇదే కంపెనీలో 24ఏళ్ల పాటు సేవలు అందించిన కాగ్నిజెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే కూడా సెప్టెంబర్ 30న వైదొలగనున్నారు. ఆయన స్థానంలో యాక్సెంచర్ ఎగ్జిక్యూటివ్ ఆండీ స్టాఫోర్డ్‌ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది.  

‘‘కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ సమయంలో మీరు క్లయింట్ లకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచదేశాలకు మరిన్ని సేవలు అందిచాల్సిన బాధ్యత కాగ్నిజెంట్‌పై ఉంది. ఇప్పటికే సంస్థ అనేక దేశాల్లో సేవలందిస్తున్నది. ప్రపంచంలో తమ కంపెనీ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరిగింది’’ అని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో సీఈవో బ్రియాన్ పేర్కొన్నారు. ఇదే విధంగా రామ్మూర్తి ‍కంపెనీకి అందించిన సేవలు మరువలేనివని, సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని బ్రియాన్‌ కొనియాడారు. 

మరిన్ని వార్తలు