సీనియర్లను ఇంటికి పంపేస్తున్న కాగ్నిజెంట్‌

3 Aug, 2018 11:17 IST|Sakshi
కాగ్నిజెంట్‌ టెక్నాలజీ (ఫైల్‌ ఫోటో)

అంతర్జాతీయ ప్రముఖ టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ సీనియర్లను ఇంటికి పంపేస్తుంది. సీనియర్‌ స్థాయి ఉద్యోగాలపై వేటు వేయాలని చూస్తున్నట్టు కాగ్నిజెంట్‌ ప్రకటించింది. సీనియర్లపై వేటు వేయాలని చూస్తున్న ఈ కంపెనీ, ఆ స్థానాల్లో మరింత మంది జూనియర్లకు చోటు కల్పించనున్నట్టు కూడా తెలిపింది. గురువారం ప్రకటించిన కంపెనీ రెండో క్వార్టర్‌ ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను కాగ్నిజెంట్‌ చేరుకోలేకపోయింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలోనే కాగ్నిజెంట్‌ సీనియర్‌ స్థాయి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తెలిసింది.

న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్‌లో ఈ రెండో క్వార్టర్‌లో అట్రిక్షన్‌ రేటు 22 శాతానికి పైగా ఉందని వెల్లడైంది. 2017లో 4000 వేల మంది ఉద్యోగులను కాగ్నిజెంట్‌ ఇంటికి పంపేసిందని, అంతేకాక 400 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ను ఆఫర్‌ చేసినట్టు పేర్కొంది. సీనియర్లను కాగ్నిజెంట్‌ టార్గెట్‌ చేసిందని, ఇది కేవలం వాలంటరీ మాత్రమే కాదని, ఇది మరింత ఇన్‌వాలంటరీ(బలవంతం పంపించేయడం) అని కాగ్నిజెంట్‌ అధ్యక్షుడు రాజ్‌ మెహతా ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సారి లేఆఫ్‌లో ఎంతమంది సీనియర్‌ స్థాయి ఉద్యోగులును టార్గెట్‌ చేశారో ఆయన బహిర్గతం చేయలేదు. ఇది గ్లోబల్‌ ప్ర​క్రియ అని, ప్రత్యేక ప్రాంతాన్ని, ప్రత్యేక దేశాన్ని తాము టార్గెట్‌ చేయలేదని మాత్రం చెప్పారు. 

కాగ, సీనియర్లపై వేటు వేస్తున్న ఈ కంపెనీ జూనియర్‌ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటుంది. మరింత మంది జూనియర్లకు తన కంపెనీలో చోటు కల్పిస్తోంది. జూనియర్‌ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటున్న ఈ కంపెనీకి, ఈ క్వార్టర్‌లో హెడ్‌కౌంట్‌ కూడా పెరిగింది. రెండో క్వార్టర్‌లో 7500 మంది జూనియర్‌ స్థాయి ఉద్యోగులను తీసుకుని ఉద్యోగుల సంఖ్యను 2,68,900కు చేర్చుకుంది. మూడో క్వార్టర్‌లో జూనియర్‌ స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టనున్నామని ఫలితాల ప్రకటన తర్వాత కాన్ఫరెన్స్‌లో కాగ్నిజెంట్‌ సీఎఫ్‌ఓ కరెన్‌ మెక్లాగ్లిన్‌ తెలిపారు. సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు ఈ ప్రమోషన్లు నాలుగో క్వార్టర్‌లో ఉంటాయన్నారు. ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టడానికి తమకు మంచి మార్జిన్లు నమోదవడం గుడ్‌న్యూస్‌ అని మెహతా చెప్పారు. ఈ రెండో క్వార్టర్‌లో కాగ్నిజెంట్‌ రెవెన్యూలు 4.01 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. గతేడాది నుంచి ఇవి 9.2 శాతం పెంపు.   

మరిన్ని వార్తలు