28,130-28,360 శ్రేణి నుంచి బయటపడితే..

10 Aug, 2015 02:57 IST|Sakshi
28,130-28,360 శ్రేణి నుంచి బయటపడితే..

మార్కెట్ పంచాంగం
అమెరికాలో సెప్టెంబర్ నెలలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న సంకేతాలు వెలువడుతున్నా, ఇక్కడ ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించకపోయినా భారత్ సూచీలు నిలదొక్కుకోగలుగుతున్నాయి. కమోడిటీ ధరల క్షీణత, రూపాయి విలువ స్థిరత్వం తదితర అంశాలు మన మార్కెట్ గరిష్టస్థాయిలో ట్రేడ్‌కావడానికి సహకరిస్తున్నాయి. రుతు పవనాల బలహీనత, సంస్కరణల బిల్లుల స్తంభన వంటి ప్రతికూల అంశాలు కూడా మార్కెట్‌ను పడదోయడం లేదు. అనూహ్య సంఘటనలేవీ జరక్కపోతే, రానున్న వారాల్లో మార్కెట్ మరింత పెరిగే అవకాశాలే కన్పిస్తున్నాయి. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే...
 
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
బీఎస్‌ఈ సెన్సెక్స్ కదలికలు గతవారం చివరి మూడు రోజులూ 28,130-28,360 పాయింట్ల స్వల్పశ్రేణికి పరిమితమయ్యాయి. చివరకు 28,236 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ పైన ప్రస్తావించిన శ్రేణి నుంచి సూచి ఎటు వెలుపలికి వస్తే, అటువైపు కదిలే అవకాశాలుంటాయి. 28,130 పాయింట్ల దిగువన ముగిస్తే 200 రోజుల చలన సగటు రేఖ సంచరిస్తున్న 27,968 పాయింట్లు-ఆర్‌బీఐ పాలసీ వెల్లడైన ఆగస్టు 4నాటి 27,860 పాయింట్ల కనిష్టస్థాయి మార్కెట్ స్వల్పకాలిక ట్రెండ్‌కు కీలకమైనవి. ఈ స్థాయిల్ని కోల్పోతే 27,650 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున తిరిగి 27,400 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం సెన్సెక్స్ 28,360 పాయింట్ల స్థాయిని దాటితే 28,580 పాయింట్ల వద్దకు వేగంగా పెరగవచ్చు.  వరుసగా రెండు వారాలపాటు ఇదే స్థాయి వద్ద సెన్సెక్స్ నిరోధాన్ని చవిచూసినందున, ఈ వారం తదుపరి ర్యాలీ జరగాలంటే ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించాల్సివుంటుంది. ఆపైన స్థిరపడితే  కొద్ది రోజుల్లో 29,095 పాయింట్ల స్థాయిని చేరవచ్చు.  
 
నిఫ్టీ కీలక మద్దతు 8,444
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం ద్వితీయార్థంలో కేవలం 60 పాయింట్ల శ్రేణిలో (8,545-8,606) హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు 31 పాయింట్ల లాభంతో 8,564 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల శ్రేణి నుంచి ఎటు బయటపడితే, అటువైపు నిఫ్టీ ఈ వారం పయనించవచ్చు. 8,545 పాయింట్ల దిగువన ముగిస్తే 8,444 పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీ ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది. ఇదే స్థాయి వద్ద నిఫ్టీ 200 డీఎంఏ రేఖ కదలుతుండటం, నాలుగు రోజుల కనిష్టస్థాయి ఇదే కావడంతో 8,444 పాయింట్లకు సాంకేతిక ప్రాధాన్యత వుంది. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే 8,320 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. ఆ లోపున 8,195 పాయింట్ల స్థాయికి క్షీణించే ప్రమాదం వుంది. ఈ వారం 8,606 పాయింట్లను అధిగమిస్తే వేగంగా 8,655 పాయింట్ల వద్దకు చేరవచ్చు. జూలై నెలలో ఇదే స్థాయి వద్ద నిఫ్టీకి డబుల్‌టాప్ ఏర్పడినందున, సమీప భవిష్యత్తులో ఈ స్థాయిని అధిగమిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిని దాటితే 8,760 పాయింట్ల స్థాయికి వేగంగా పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే ఏప్రిల్ 15నాటి గరిష్టస్థాయి 8,845 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.
- పి. సత్యప్రసాద్

మరిన్ని వార్తలు