బంగారంపై బాదుడు తగ్గేనా..?

14 Jan, 2020 06:02 IST|Sakshi

దిగుమతి సుంకాలు తగ్గించాలని విన్నపాలు

ప్రస్తుతం ఈ రేటు 12.5 శాతం

భారీ వడ్డనతో కుదేలైన పరిశ్రమ

న్యూఢిల్లీ: పసిడిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ (దిగుమతి సుంకం)ని సాధ్యమైనంత మేర తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో ప్రవేశపెట్టనున్న 2020–21 కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విన్నవించినట్లు విశ్వసనీయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఇప్పటికే ఈ రేటును 4 శాతానికి తగ్గించాలని దేశీయ రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే కాగా, పరిశ్రమను ఆదుకోవడం కోసం ఈ తగ్గింపు తప్పనిసరని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విన్నపాన్ని ప్రభుత్వం మన్నిస్తే.. సుంకాల కోత మేర బంగారం ధరల్లో తగ్గింపు ఉంటుందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, భారత్‌లో అధిక శాతం సప్లై దిగుమతుల ద్వారానే కొనసాగుతోంది. ఏడాదికి 800–900 టన్నుల పసిడిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది.

ఎందుకింత రేటు..: గతేడాది బడ్జెట్‌కు ముందు బంగారంపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. అయితే, విదేశాల నుంచి ఈ కమోడిటీ దిగుమతులు గణనీయంగా పెరిగిపోతూ ఉండడం వల్ల కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) అదుపు తప్పుతోందని, దీనిని కట్టడి చేయడంలో భాగంగా గత బడ్జెట్‌లో 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ పెంపు తరువాత ఫలితాలు కేంద్రం అనుకున్న విధంగా ఉన్నప్పటికీ.. దేశీయ రత్నాభరణాల పరిశ్రమకు మాత్రం తగిన ప్రోత్సాహం లభించలేదు. ఏప్రిల్‌–నవంబర్‌ కాలంలో ఈ రంగ ఎగుమతులు 1.5% తగ్గడం ఇందుకు నిదర్శనం. దిగుమతి సుంకాలు అధికంగా ఉన్న కారణంగా పలు కంపెనీలు సరిహద్దు దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంతటి రేటు ఉండడం సమంజసం కాదని వాణిజ్య శాఖ కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు