రేట్ల కోత అంచనాలతో లాభాలు

29 Mar, 2019 06:17 IST|Sakshi

కలసివచ్చిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు

కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల జోరు

వచ్చే వారం ఆర్‌బీఐ పాలసీ

పుంజుకున్న రేట్ల కోత అంచనాలు

వడ్డీరేట్ల ప్రభావిత షేర్లకు లాభాలు

413 పాయింట్ల లాభంతో 38,546కు సెన్సెక్స్‌

125 పాయింట్లు ఎగసి 11,570కు నిఫ్టీ

బ్యాంక్, ఫైనాన్స్, ఐటీ షేర్ల జోరుతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,500 పాయింట్లు, నిఫ్టీ 11,550 పాయింట్ల ఎగువున ముగిశాయి. మోనిటరీ పాలసీలో భాగంగా వచ్చే వారం ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా బ్యాంక్‌లకు మరిన్ని మూలధన నిధలు లభిస్తాయన్న అంచనాలు బలం పుంజుకుంటున్నాయి. ఈ కారణంగా వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ, వాహన షేర్లు మంచి లాభాలు గడించాయి. మార్చి సిరీస్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో షార్ట్‌  కవరింగ్‌ కొనుగోళ్లు భారీగా జరిగాయి. లోహ, విద్యుత్‌ రంగ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడినా, స్టాక్‌ సూచీలు ముందుకే దూసుకుపోయాయి. ముడి చమురు ధరలు తగ్గటం సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌413 పాయింట్లు పెరిగి 38,546 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 11,570 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు స్టాక్‌ సూచీల ఆరు నెలల గరిష్ట స్థాయిలకు చేరాయి.

రోజంతా లాభాలే...
లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. ట్రేడింగ్‌ జరుగుతున్న కొద్దీ, లాభాలు పెరుగుతూ పోయాయి. వాణిజ్య చర్చల్లో భాగంగా గతంలో లేని ప్రతిపాదనలను చైనా అమెరికా ముందు ఉంచిందన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి.  మరోవైపు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మరింత బలపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 461 పాయింట్లు, నిఫ్టీ 143 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. బాండ్ల రాబడుల తగ్గినప్పటికీ, ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈ మార్చి సిరిస్‌లో నిఫ్టీ 777 పాయింట్లు పెరిగింది. నాలుగేళ్ల తర్వాత నిఫ్టీ ఒక సిరీస్‌లో ఇంత అత్యధికంగా లాభపడటం ఇదే మొదటిసారి.

బ్యాంక్‌ షేర్ల జోరు...
రేట్ల కోత అంచనాలతో బ్యాంక్‌ షేర్లు జోరుగా పెరిగాయి. దీంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకింది. ఇంట్రాడేలో 30,496 పాయింట్లను తాకిన బ్యాంక్‌ నిఫ్టీ 401 పాయింట్ల లాభంతో 30,421  పాయింట్ల వద్ద ముగిసింది. ఈమార్చి సిరీస్‌లో బ్యాంక్‌ నిఫ్టీ 3,631 పాయింట్లు లాభపడింది. ఒక సిరీస్‌లో ఈ సూచీ ఇన్నేసి పాయింట్లు లాభపడటం ఇదే మొదటిసారి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 7 శాతం, ఎస్‌బీఐ 3%, యస్‌బ్యాంక్‌ 2.8 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.8%, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లు 2.3%చొప్పున పెరిగాయి. కేంద్రం రూ.5,042 కోట్ల మూలధన నిధులు అందించనుండటంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 6.6 శాతం లాభపడి రూ. 130 వద్దకు చేరింది. ఎస్‌బీఐ 3.3% లాభంతో రూ.318 వద్ద ముగిసింది.

లక్ష కోట్లు దాటిన టైటాన్‌
టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ కంపెనీ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,135ను తాకింది. చివరకు 1.7 శాతం లాభంతో రూ.1,134 వద్ద ముగిసింది. షేర్‌ జోరు కారణంగా కంపెనీ మార్కెట్‌క్యాప్‌రూ.1,372 కోట్లు పెరిగి రూ.1,00,298 కోట్లకు ఎగసింది. మార్కెట్‌ విలువలో అతి పెద్ద కంపెనీల జాబితాలో టైటాన్‌ కంపెనీది 30వ స్థానం. రూ.8.62 లక్షల కోట్లుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొదటి స్థానంలో రూ.7.50 లక్షల కోట్లతో టీసీఎస్‌ రెండో స్థానంలో ఉన్నాయి.

మార్కెట్‌ కబుర్లు
► స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.52 లక్షల కోట్లు పెరిగి రూ.1.49,83,160 కోట్లకు చేరింది.
► ఐటీ కంపెనీల ఉద్యోగ నియామకాలు గత రెండు నెలల్లో పటిష్టంగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఐటీ షేర్లు రాణించాయి.
► హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రేటింగ్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా–మెరిల్‌ లించ్‌ సంస్థ తటస్థం నుంచి కొనచ్చుకు అప్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ ధరను రూ.1,060 నుంచి రూ.1,250కు పెంచింది. దీంతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 4% లాభంతో రూ.1,082 వద్ద ముగిసింది.
► డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీలో పిరమళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ, వాటా కొనబోతుందన్న వార్తల నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ 9.5 శాతం ఎగసి రూ.149 వద్ద ముగిసింది.
æ    స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడినప్పటికీ వాహన దిగ్గజం, హీరో మోటొకార్ప్‌ రెండేళ్ల కనిష్ట స్థాయి, రూ.2,517ను తాకింది. చివరకు 1 శాతం నష్టంతో రూ.2,532 వద్ద ముగిసింది.  గత మూడు నెలల్లో ఈ షేర్‌ 20 శాతం పతనమైంది.
► టైటాన్‌ షేర్‌తో పాటు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకిన కంపెనీల్లో ఏషియన్‌ పెయింట్స్, యాక్సిస్‌ బ్యాంక్, బజాజ్‌ హోల్డింగ్స్, బాటా ఇండియా, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌ ఉన్నాయి.
 


మరిన్ని వార్తలు