కమోడిటీ ట్రేడింగ్‌ సమయం పెరిగింది 

1 Dec, 2018 00:38 IST|Sakshi

ఇక ఉదయం 9 గంటలకే ప్రారంభం

సెబీ తాజా నిర్ణయం

న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ విభాగంలో ట్రేడింగ్‌ సమయం మరింతగా పెరగనుంది. అంతే కాకుండా ట్రేడింగ్‌లో పాల్గొనడానికి రైతు సంఘాలను, విదేశీ సంస్థలను కూడా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడంలో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. సవరించిన వేళల ప్రకారం, వ్యవసాయేతర కమోడిటీల ట్రేడింగ్‌  ఉదయం 9 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి గం.11.55 నిమిషాల వరకూ కొనసాగుతుంది. గతంలో ట్రేడింగ్‌ సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి గం.11.55 వరకూ ఉండేది. ఇక వ్యవసాయ, వ్యవసాయ ప్రాసెస్డ్‌ కమోడిటీల ట్రేడింగ్‌ ఉదయం 9 గంటలకు మొదలై రాత్రి 9కి ముగుస్తుంది.

గతంలో ఈ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ ఉదయం 10 నుంచి రాత్రి 9.30 వరకూ ఉండేది. ఈ మేరకు గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు తమ కమోడిటీ డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ వేళలను సరిచేసుకోవాలని సెబీ పేర్కొంది. సవరించిన ట్రేడింగ్‌ వేళలు ఈ సర్క్యులర్‌ వెలువడిన నెల రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని, స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు తమ నియమ నిబంధనల్లో తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సెబీ సూచించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ అడ్వైజరీ కమిటీ సూచనలు ఆధారంగా ఈ తాజా నిర్ణయం తీసుకున్నామని సెబీ తెలిపింది. 

మరిన్ని వార్తలు