కంపెనీలకు ఐటీఆర్‌ మినహాయింపులు రద్దు

13 Feb, 2018 02:06 IST|Sakshi

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: డొల్ల కంపెనీలపై కొరడా ఝుళిపించే క్రమంలో కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా .. కట్టాల్సిన పన్ను రూ. 3,000కు లోబడి ఉండే సంస్థలకు ఐటీ రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలు నుంచి మినహాయింపునిస్తుండటాన్ని ఇకపై రద్దు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆయా కంపెనీలు పెట్టే పెట్టుబడులను ఆదాయ పన్ను విభాగం నిశితంగా పరిశీలిస్తుందని వివరించారు.

లాభం తక్కువగా చూపే సంస్థలు, అలాగే తొలిసారిగా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న సంస్థలపైన కూడా మరింతగా దృష్టి పెట్టనున్నట్లు అధికారి పేర్కొన్నారు. సుమారు అయిదు లక్షలకు పైగా కంపెనీలు రిటర్నులు దాఖలు చేయడం లేదని, మనీలాండరింగ్‌కు ఇవి ఉపయోగపడుతున్నాయన్న సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 లక్షల పైగా సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. వీటిలో సుమారు 7 లక్షల సంస్థలు వార్షిక నివేదికలతో పాటు రిటర్నులూ దాఖలు చేస్తున్నాయి. ఇందులో 3 లక్షల సంస్థలు ఆదాయమే లేనట్లుగా చూపుతున్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 276సీసీ ప్రకారం ఉద్దేశపూర్వకంగా గడువులోపల ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారిపై జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు.
 

మరిన్ని వార్తలు