చదువు నుంచి కొలువు వరకూ..!

1 Aug, 2015 01:29 IST|Sakshi

కెరీర్‌కు సరైన గెడైన్స్‌గా నిలుస్తున్న జ్ఞాన్‌ఫైండర్, హ్యాపీమైండ్స్
ట్రెండ్ కు తగ్గ చదువేదో చెప్పే జ్ఞాన్‌ఫైండర్
అందుకు తగ్గ కొలువెక్కడుందో చెప్పే హ్యాపీమైండ్స్
నిధుల సమీకరణపై దృష్టిపెట్టిన సంస్థలు
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చదువు, కొలువు! చాలా మందికి ప్రధాన లక్ష్యం ఇదే. అయితే సరైన సమయంలో సరైన చదువో, కొలువో దక్కకపోతే అంతే సంగతి. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేయటానికే అన్నట్లు... స్టార్టప్ కంపెనీలు జ్ఞాన్‌ఫైండర్, హ్యాపీమైండ్స్ రెండూ యువతకు ఎలాంటి కోర్సులు ఎంపిక చేసుకోవాలో, ఉపాధి అవకాశాలెలా ఉంటాయో.. వంటి సమాచారం మొత్తాన్ని ఉచితంగానే అందిస్తున్నాయి.  హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ రెండు స్టార్టప్ సంస్థల వివరాలు ఈవారం ‘సాక్షి స్టార్టప్ డైరీలో’..

 ఉద్యోగ సమాచారమంతా సెల్‌ఫోన్‌కే..
 మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. దాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని ఆశ్రయించింది హ్యాపీమైండ్స్. రూ.3 లక్షల సొంత పెట్టుబడితో 2013 జనవరిలో దీన్ని ప్రారంభించారు లీలాధర్. ఉద్యోగ సమాచారమిచ్చే కన్సల్టెన్సీలు నగరంలో బోలెడన్ని ఉన్నాయిలే అని తేలిగ్గా తీసిపారేయలేం. ఎందుకంటే కన్సల్టెన్సీలకు హ్యాపీమైండ్స్‌కు ఉన్న ప్రధాన తేడా ఏంటంటే... ఉద్యోగ భర్తీ సమాచారాన్ని నేరుగా కస్టమర్ల సెల్‌ఫోన్‌కు చేరవేయటమే. ఇంకా చెప్పాలంటే నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధి అన్నమాట. హ్యాపీమైండ్స్ సేవలను వినియోగించుకోవాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి హ్యాపీమైండ్స్‌ను యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

తర్వాత యూజర్ తన విద్యార్హతలు, చిరునామా, ఫోన్ నంబర్, రెజ్యూమ్ వంటి వివరాలను నమోదు చేసుకుంటే చాలు. హ్యాపీమైండ్స్‌లో నమోదైన ఆయా కంపెనీలకు సంబంధించిన ఉద్యోగ భర్తీ, నోటిఫికేషన్ల తాలుకా సమాచారం నేరుగా కస్టమర్ల సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ రూపంలో వెళుతుంది. అవసరమైతే యాప్ నుంచి కంపెనీకి రెజ్యూమ్‌ను కూడా ఫార్వర్డ్ చేయవచ్చు.

►హైదరాబాద్‌లోనే కాదు బెంగళూరు, పుణె, చెన్నై నగరాల్లో మన చదువుకు తగ్గ కొలువులెక్కడున్నాయి? ఏ కంపెనీలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి? ఏ హోదాలో నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి? జీతభత్యాలెంత? వంటి ఉద్యోగ సంబంధ సమస్త సమాచారాన్నీ ఎప్పటికప్పుడు అందిస్తుంది.
►ఐటీ, నాన్-ఐటీ రంగాలకు చెందిన సుమారు 30 కంపెనీలు.. 50 బ్రాంచీలు హ్యాపీమైండ్స్‌లో నమోదు చేసుకున్నాయి. ఇప్పటివరకు 1,500 మంది ఈ యాప్‌ను వినియోగించుకొని ఉపాధి పొందారు. అయితే ఈ సేవలన్నీ యాప్ యూజర్లకు పూర్తిగా ఉచితం. కంపెనీలకు మాత్రం ఉద్యోగ స్థాయిని బట్టి రూ.5 వేల చార్జీ ఉంటుంది.
►‘‘సంస్థను ప్రారంభించిన తొలి ఏడాది రూ.28 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నాం. గతేడాది రూ.1.97 కోట్లకు చేరుకున్నాం. ఈ ఏడాది రూ.5 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే సగానికి పైగా టర్నోవర్‌ను సాధించాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మరో 6-8 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం’’ అని చెప్పారు లీలాధర్.
 
 చదువులన్నీ ఒకే వేదికగా..
  ఆండ్రాయిడ్, ఐఓస్.. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్‌లు మాత్రమే కాదు. నేటి ట్రెండ్ కోర్సులు కూడా. రోజుకో కొత్త ఆవిష్కరణ బయటికొస్తున్న ఈ రోజుల్లో ట్రెండ్‌కు తగ్గ చదువులు లేకపోతే టెక్నాలజీ పరుగులో వెనకబడిపోతాం. అందుకే ఇలాంటి వినూత్న కోర్సులను అంది స్తున్న సంస్థలేంటి? వర్సిటీలేంటి? భవిష్యత్తు ఉపాధి అవకాశాలేంటి? ఈ వివరాలన్నీ అందిస్తోంది ‘జ్ఞాన్‌ఫైండర్.కామ్’. దేశంలో ట్రయినింగ్ ఇనిస్టిట్యూషన్లకు సరైన వేదికంటూ లేదని తెలుసుకున్న ప్రవాస ఐటీ నిపుణులు వంశీ వనపర్తి, సురేష్ కలిసి రూ.50 లక్షల పెట్టుబడులతో 2015 జనవరిలో జ్ఞాన్‌ఫైండర్.కామ్‌ను స్థాపించారు.
►డిమాండున్న కోర్సులు, భవిష్యత్తులో రానున్న కోర్సులు, వాటిని అందిస్తున్న ఇనిస్టిట్యూషన్లు, ఫీజులు, కాలపరిమితి, కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు, జీతభత్యాలు.. ఇలా చదువు నుంచి కొలువు వరకు సమస్త సమాచారాన్నీ ఒకే వేదికగా అందించడమే జ్ఞాన్‌ఫైండర్ ప్రత్యేకత.
►ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, అహ్మదాబాద్, ఢిల్లీ, గోర్గావ్, నోయిడా, కోల్‌కతాల్లోని సుమారు 12 వేల ఇనిస్టిట్యూషన్ల జ్ఞాన్‌ఫైండర్‌లో నమోదు చేసుకున్నాయి. 15 వేల మంది విద్యార్థులు సేవలను వినియోగించుకున్నారు కూడా. ప్రస్తుతానికైతే యూజర్లకు, ఇనిస్టిట్యూషన్లకు ఇద్దరికీ ఉచితంగానే సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇనిస్టిట్యూషన్‌కు ఏడాదికి రూ.10-15 వేల చార్జీ వసూలు చేయనున్నట్లు వంశీ వెల్లడించారు.
►కోర్సులు, సంస్థలే కాకుండా.. విద్యార్థులు చేరబోయే కోర్సు తాలుకా వివరాలను ఈ సైట్‌లో అప్‌లోడ్ చేస్తే.. ఆ కోర్సుకున్న డిమాండ్ ఎంత? ఏయే నగరాలు, దేశాల్లో ఉపాధి అవకాశాలున్నాయి? వంటి వివరాలు అందిస్తారు. దీంతో విద్యార్థులే స్వయంగా కోర్సు ఎంపిక చేసుకునే వీలుంటుంది.
►విస్‌డమ్ జాబ్‌పోర్టల్ రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సంస్థలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు