గందరగోళంలో సెజ్‌ యూనిట్లు

5 Jun, 2020 06:39 IST|Sakshi

అద్దె వాయిదాకు కేంద్రం వెసులుబాటు

చెల్లింపులపై స్పష్టత నివ్వని ఉత్తర్వులు

ఇప్పుడే కట్టాలంటూ డెవలపర్ల ఒత్తిడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ పరిణామాలతో అద్దెలపరంగా కేంద్రం ఇచ్చిన వెసులుబాటులో స్పష్టత కొరవడటంతో ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్‌) యూనిట్లు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. వివరాల్లోకి వెడితే.. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్న నేపథ్యంలో తమకు తోడ్పాటు ఇవ్వాలంటూ సెజ్‌ ఎగుమతిదారులు కేంద్రాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ కొన్ని ఊరట చర్యలు ప్రకటించింది. వీటి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెజ్‌ యూనిట్ల లీజు అద్దె పెరగదు. అలాగే, తొలి త్రైమాసికం లీజు అద్దెను జూలై 31 వరకూ వాయిదా వేస్తూ గత నెల 28న నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాయిదాపడిన చెల్లింపులపై వడ్డీ భారం ఉండబోదని పేర్కొంది.

తమ తమ జోన్లలో ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందంటూ ప్రభుత్వ, ప్రైవేట్‌ సెజ్‌ డెవలపర్లకు సూచించింది. ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్‌ నెలల్ని తొలి త్రైమాసికంగా పరిగణిస్తారు. తొలి త్రైమాసికం అద్దెను వాయిదా వేశారు సరే!!. ఈ వాయిదా జులై 31 వరకూ ఉంటుందని పేర్కొనటంతో ఈ వాయిదా వేసిన అద్దెను జూలై 31లోగా చెల్లించేయాలా? లేక జూలై 31 వరకూ అద్దెను వాయిదా వేసి ఆ తరవాత చెల్లించవచ్చా? అనే సందిగ్ధంలో సెజ్‌ యూనిట్లున్నాయి. దీనిపై స్పష్టత రాకముందే తమ అద్దెలు చెల్లించాల్సిందేనంటూ డెవలపర్లు ఒత్తిడి తెస్తున్నట్లు పలు కంపెనీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని, అద్దె వాయిదాలపై స్పష్టతనివ్వాలని, డెవలపర్లకూ తగు ఆదేశాలివ్వా లని కోరాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ క లిసి 356 నోటిఫైడ్‌ సెజ్‌లుండగా అందులో విశాఖ, చెన్నై, కాండ్లా సహా 8 ప్రభుత్వ సెజ్‌లున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు