చేతుల్లో ఫోన్లు.. చేవలేని సేవలు!

28 Sep, 2017 02:05 IST|Sakshi

అవసరానికి పనికొస్తాయనే నమ్మకం లేదు

కాల్‌డ్రాప్, కవరేజీ సమస్య తీవ్రం

కంపెనీలు చిత్తశుద్ధితో కృషి చేయాలి  

అమెరికాలో వాహనాల వేగానికి సంబంధించి 1970లో ఓ పుస్తకం విడుదలైంది. ‘‘వేగమెంతైనా రక్షణ లేదు’’ అనే పేరుతో వినియోగదారుల హక్కుల నేత రాల్ఫ్‌నాడార్‌ రాసిన ఈ పుస్తకం... ఆటోమొబైల్‌ రంగంపై చేసిన దారుణమైన విమర్శ. ఆ తరవాత నాటి ప్రపంచ అతిపెద్ద టెలిఫోన్‌ కంపెనీ ఏటీ అండ్‌ టీపై కె. ఆబ్రే స్టోన్‌ ఓ పుస్తకం రాశారు. ‘‘సారీ! మీ గుత్తాధిపత్యం ఇక నడవదు’’ అంటూ ఆయన రాసిన పుస్తకం ఏటీ అండ్‌ టీకి చెంపపెట్టు.

అది చూశాక మన టెలిఫోన్లు, టెలికం విభాగం పని తీరును వివరిస్తూ ‘‘ఏ అవసరమూ తీరుతుందన్న నమ్మకం లేదు’’ అని నేను రాశాను. సేవల్లో నాణ్యత దిగజారటానికి గుత్తాధిపత్యమే కారణమని దాన్లో పేర్కొన్నా... తరవాత గుత్తాధిపత్యానికి రోజులు చెల్లి, టెలికం సేవల్లోకి ప్రైవేటు రంగ కంపెనీలు ప్రవేశించాయి. నియంత్రిత పోటీ మొదలైంది. దీని పరిణామమే మనందరి చేతుల్లో మొబైల్‌ ఫోన్లు. అవికూడా... దాదాపు 120 కోట్లు.

కాకపోతే ఇపుడు వారాలు గడుస్తున్న కొద్దీ మొబైల్‌ టెలిఫోన్‌ సేవలు దిగజారిపోతున్నాయి. కాల్‌డ్రాప్‌లు నిత్యకృత్యమయ్యాయి. ‘‘క్షమించాలి! మీరు ప్రయత్నిస్తున్న ఫోను మా సర్వీసు ఏరియాలో లేదు. మేం ఎస్‌ఎంఎస్‌ పంపిస్తాం’’ అనేది తరచూ వింటున్నాం. కొన్నిసార్లు ‘‘మీరు ప్రయత్నిస్తున్న నంబరు అందుబాటులో లేదు’’ అనేదీ వినిపిస్తోంది. చిత్రమేంటంటే ఇలాంటి సందేశాలు మనం ఎప్పుడు, ఎక్కడ వినాల్సి వస్తుందనేది ఊహించలేం.

సెల్‌ఫోన్‌ సేవలు ఏ అవసరాన్నీ తీరుస్తాయనే నమ్మకం లేదనుకోవటానికి కారణాలివే. విపరీతమైన పోటీ, క్రియాశీలమైన నియంత్రణ ఉన్నా ఇలా జరుగుతోంది మరి!!. మనక్కావాల్సిందల్లా ఏ అవసరాన్నయినా తీర్చగలిగే సెల్‌ఫోన్‌ సేవలు. అవి తీరుస్తాయనే  నమ్మకం. దీన్ని కలిగించాలంటే కంపెనీలు చిత్తశుద్ధితో మరింత కృషి చేయాల్సి ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా