ఆర్థిక సర్వే బూస్ట్- మార్కెట్ పరుగు

28 Feb, 2015 02:54 IST|Sakshi
ఆర్థిక సర్వే బూస్ట్- మార్కెట్ పరుగు

- 29,000 దాటిన సెన్సెక్స్
- 8,800 పైన ముగిసిన నిఫ్టీ
- శనివారమైనా, నేడు ట్రేడింగ్
- మార్కెట్  అప్‌డేట్

ముంబై : ఆర్థిక సర్వే బడ్జెట్‌పై ఆశలు పెంచడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ దూసుకెళ్లింది.  ద్రవ్య పరిస్థితులు మెరుగుపడ్డాయని, వేగవంతమైన వృద్ధి ఉండొచ్చనే అంచనాలను అందించిన ఆర్థిక సర్వే భారీ సంస్కరణలు ఉంటాయనే ఆశలను రేకెత్తించింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, లోహ, మైనింగ్, విద్యుదుత్పత్తి, వాహన రంగ షేర్లు పెరిగాయి. గత ట్రేడింగ్ సెషన్లలో ఆచి, తూచి వ్యవహరించిన ఇన్వెస్టర్లు ఆర్థిక సర్వే జోష్‌తో భారీగా కొనుగోళ్లు జరిపారు.  సెన్సెక్స్ 29,000 పాయింట్లను, నిఫ్టీ 8,800 పాయింట్లను దాటాయి.   

సెన్సెక్స్ 473 పాయింట్లు (1.65 శాతం)లాభపడి 29,220 పాయింట్ల వద్ద, నిఫ్టీ 161 పాయంట్లు(1.85 శాతం) లాభపడి  8,845 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒకే రోజున ఇంత భారీ ర్యాలీ జరగడం ఆరువారాల్లో ఇదే ప్రధమం. కాగా  నేడు (శనివారమైనా) స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు మామూలుగానే ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్నాహ్నం 3.30గం. వరకూ పనిచేస్తాయి.
 
వెలుగులో రక్షణ రంగ షేర్లు : రక్షణ మంత్రిత్వ శాఖ బ్యాటిల్‌ఫీల్డ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన కారణంగా టాటా పవర్ 5.5 శాతం వృద్ధితో రూ.87కు, ఎల్‌అండ్‌టీ 4.8 శాతం వృద్ధితో రూ. 1,759కు పెరిగాయి. 50 వేల కోట్ల భారీ ఆర్డర్ రక్షణ శాఖ నుంచి రావడంతో రోల్టా ఇండియా 19 శాతం, బీఈఎల్ 3 శాతం చొప్పున పెరిగాయి.  బడ్జెట్‌లో గృహ, మౌలిక రంగానికి రాయితీలు ఉండొచ్చన్న అంచనాలతో రియల్టీ, ఇన్‌ఫ్రా షేర్లు పెరిగాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్స్)కు సంబంధించిన పన్ను అంశాల్లో స్పష్టత వస్తుందన్న అంచనాలు కూడా రియల్టీ షేర్ల పెరుగుదలకు తోడ్పడింది.  మూడు రోజులుగా పతమవుతూ వచ్చిన రైల్ షేర్లు ఈ జోరులో 10 శాతం వరకూ పెరిగాయి. పుత్తడిపై ఆంక్షలు తొలగించవచ్చన్న ఆర్థిక సర్వే వెల్లడించడంతో టైటన్, టీబీజడ్ వంటి జ్యూయలరీ షేర్లు పెరిగాయి. కాగా సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం పెరుగుతుందన్న అంచనాలతో ఐటీసీ రూ.394కు తగ్గింది. 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు నష్టపోగా, 26 షేర్లు లాభాల్లో ముగిశాయి.  
 
బడ్జెట్ షేర్లు... అంచనాలు!
మోదీ ప్రభుత్వ పూర్తి స్థాయి బడ్జెట్‌ను నేడు(శనివారం) పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నారు. శనివారం స్టాక్ మార్కెట్‌కు సెలవైనా, బడ్జెట్ సందర్భంగా ట్రేడింగ్ జరగనున్నది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభావిత షేర్లపై ఒక అంచనా...
 ప్రతిపాదన: రక్షణ రంగానికి పెరగనున్న కేటాయింపులు
 షేర్లు: గుజరాత్ పిపవావ్‌లకు సానుకూలం
 ప్రతిపాదన: అందరికీ ఇళ్లు కార్యక్రమం, వ్యక్తిగత ఆదాయపు పన్ను పెంపు
 షేర్లు: హెచ్‌డీఐఎల్, యూనిటెక్, పురవంకరలకు ఓకే!
 ప్రతిపాదన: రియల్‌ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్(రీట్స్)కు సంబంధించి పన్నులపై స్పష్టత- రీట్స్‌ను డీడీటీ/మ్యాట్, దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయించవచ్చు
 షేర్లు: డీఎల్‌ఎఫ్, ప్రెస్టీజ్, అదాని పోర్ట్స్‌లకు సానుకూలం
 ప్రతిపాదన: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన నిధులు, ప్రభుత్వ బ్యాంకులకు హోల్డింగ్ కంపెనీ విధి విధానాలపై స్పష్టత
 షేర్లు: ఎస్‌బీఐ,  పీఎన్‌బీ, తదితర బ్యాంకులు
 ప్రతిపాదన: ముడిచమురుపై కస్టమ్స్ సుంకం 2.5-5 శాతం వరకూ పెంపు
 షేర్లు: ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు సానుకూలం
 బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ వంటి ప్రభుత్వ పెట్రో మార్కెటింగ్ కంపెనీలకు ప్రతికూలం
 ప్రతిపాదన: పెట్రో ఇంధనాలపై సబ్సిడీ భారం తగ్గింపు లేదా మినహాయింపు
 షేర్లు: ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు సానుకూలం
 ప్రతిపాదన: సిగరెట్లపై  ఎక్సైజ్ సుంకం పెంపు
 షేర్లు: ఐటీసీకు ప్రతికూలం
 ప్రతిపాదన: పుత్తడిపై దిగుమతి సుంకం తగ్గింపు
 షేర్లు: టైటాన్, టీబీజడ్, తదితర షేర్లకు సానుకూలం

మరిన్ని వార్తలు