డిపాజిట్లకోసం బ్యాంకుల మధ్య పోటీ! 

12 Mar, 2019 01:05 IST|Sakshi

రుణ వృద్ధి అవకాశాల  నేపథ్యంలో ఇండియా రేటింగ్స్‌ అంచనా

ఇదే జరిగితే వడ్డీరేట్లు పెరిగే చాన్స్‌!  

న్యూఢిల్లీ: దేశంలో రుణ వృద్ధి అవకాశాల మెరుగుపడుతున్న నేపథ్యంలో... డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ అంచనావేస్తోంది. ఇదే జరిగితే డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపునకు ఈ పరిస్థితి దారితీస్తుందని విశ్లేషించింది. ముఖ్యంగా బల్క్‌ డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొంటుందని రేటింగ్‌ ఏజెన్సీ తాజా నివేదిక వివరించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, వ్యవస్థలో రుణ వృద్ధి 12.9 శాతం అయితే, అదే సమయంలో డిపాజిట్ల వృద్ధి రేటు 9.3 శాతం.

డిపాజిట్ల సమీకరణకు పోటీ పరిస్థితి నెలకొనవచ్చని ఈ అంశం సూచిస్తున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికాన్ని చూస్తే,  మొత్తం బ్యాంకింగ్‌ రుణవృద్ధి రేటు 8.4 శాతం అయితే, ఇదే కాలంలో డిపాజిట్‌ వృద్ధి రేటు  4.9 శాతం. అయితే ఒక్క ప్రైవేటు బ్యాంకులు రుణ వృద్ధి భారీగా 22 శాతం నమోదవుతుండడం గమనార్హం. దీనితో ప్రైవేటు రంగ బ్యాంకులు నిధుల సమీకరణలో భాగంగా డిపాజిట్‌ రేట్లను పెంచే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ పేర్కొంది.    

మరిన్ని వార్తలు