బ్యాంకింగ్ లావాదేవీల్లో పెరిగిన ఫిర్యాదులు

28 Aug, 2014 00:46 IST|Sakshi
బ్యాంకింగ్ లావాదేవీల్లో పెరిగిన ఫిర్యాదులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడచిన ఆర్థిక ఏడాదిలో బ్యాంకింగ్ సేవలపై అందిన ఫిర్యాదుల్లో 4 శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లో కలిపి బ్యాంకింగ్ సేవలపై 4,477 ఫిర్యాదులు వచ్చాయని ఇందులో అత్యధికంగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలపైనే ఉన్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకింగ్ అంబూడ్స్‌మన్ ఎన్.కృష్ణ మోహన్ తెలిపారు. 2012-13ల్లో ఫిర్యాదుల సంఖ్య 4,303గా ఉంది.

గతేడాది బ్యాంకింగ్ ఫిర్యాదుల వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం ఫిర్యాదుల్లో 28 శాతం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలపైనే ఉన్నాయని, ఇది కొద్దిగా ఆందోళన కలిగించే విషయమన్నారు. ఏటీఎం, క్రెడిట్ కార్డుల్లో భద్రతా ప్రమాణాలు పెంచినప్పటికీ ఇంకా ఖాతాదారుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, అలాగే బ్యాంకులు కూడా మరింత పటిష్టమైన టెక్నాలజీని వినియోగించాల్సి ఉందన్నారు.

 బ్యాంకుల వారిగా చూస్తే ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకులపైనే అధిక ఫిర్యాదులు ఉన్నాయని, కాని గతేడాదితో పోలిస్తే ఎస్‌బీఐ గ్రూపు వాటా తగ్గడం గమనించాల్సిన అంశంగా కృష్ణ మోహన్ పేర్కొన్నారు. 2012-13 ఫిర్యాదుల్లో ఎస్‌బీఐ గ్రూపు వాటా 47 శాతంగా ఉంటే అది ఇప్పుడు 44 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ఇతర జాతీయ బ్యాంకులపై వచ్చిన ఫిర్యాదులు 24 శాతంగా ఉంటే ప్రైవేటు బ్యాంకులపై 18 శాతం ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన జరగడంతో ఫిర్యాదులను జిల్లాల వారీగా విభజించి లెక్కించడం జరిగిందని, ఈ ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి 53 శాతం ఫిర్యాదులు వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 47 శాతం వచ్చినట్లు కృష్ణ మోహన్ పేర్కొన్నారు.

 మెట్రోపాలిటన్, పట్టణాల్లో ఫిర్యాదుల సంఖ్య స్వల్పంగా పెరిగితే, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గడం విశేషం.
 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పడే వరకు రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉమ్మడిగా సేవలను అందిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని ఏర్పడిన తర్వాత అక్కడ కొత్తగా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయంతో పాటు ప్రత్యేకంగా అంబూడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆర్‌బీఐ రీజనల్ డెరైక్టర్ (ఏపీ, తెలంగాణ) కె.ఆర్.దాస్ తెలిపారు. బుధవారం ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయంలో అంబూడ్స్‌మన్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మరిన్ని వార్తలు