డాలర్‌ దయపై బంగారం భవిత

13 Mar, 2017 04:39 IST|Sakshi
డాలర్‌ దయపై బంగారం భవిత

ఐదు వారాల కనిష్టానికి పసిడి
వారంలో 30 డాలర్లు పతనం
ఫెడ్‌ రేట్ల పెంపు ఖాయమన్న వార్తలే కారణం


న్యూఢిల్లీ/న్యూయార్క్‌: అమెరికా డాలర్‌ కదలికలు బంగారంపై బలంగానే పడుతున్నాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌ మార్చి 14–15 తేదీల్లో ఫండ్‌ రేటు (ప్రస్తుతం 0.50 శాతం) పెంచటం ఖాయమన్న వార్తలు బంగారాన్ని కిందకు దించుతున్నాయి. ఎందుకంటే ఫెడ్‌ గనుక రేటు పెంచితే నగదు బాండ్లలోకి వెళుతుందని, పసిడిపై పెట్టుబడులు తగ్గుతాయి కనుక ధర ఇంకా దిగుతుందనేది విశ్లేషకుల మాట. దీంతో భవిష్యత్‌ పసిడి కదలికలకు ఫెడ్‌ నిర్ణయం కీలకం కానుందని వారు చెబుతున్నారు. ఫెడ్‌ రేటు పెంచితే డాలర్‌ మరింత పెరగటం ఖాయమన్న అంచనాలు పసిడిని నడిపిస్తాయని,

అంతర్జాతీయంగా ఇలా...
10వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో  ఔన్స్‌ (31.1గ్రా) ధర 30 డాలర్లు తగ్గి 1,204 డాలర్ల వద్ద ముగిసింది. ఇది ఐదు వారాల కనిష్టస్థాయి. గత వారం ఒక దశలో పసిడి ఇక్కడ 1,195 డాలర్ల స్థాయికి సైతం వెళ్లింది. రెండు వారాల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు 53 డాలర్లు తగ్గడం విశేషం. పసిడికి 1,200 డాలర్ల వద్ద చిన్న మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

15 వరకూ అనిశ్చితి
ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన గణాంకాలు గనుక ఫెడ్‌ అంచనాలకు అనుగుణంగా ఉంటే మార్చి 14–15 తేదీల్లో ఫెడ్‌ రేటు పెంచే అవకాశాలు ఉంటాయని 10 రోజుల క్రితం యెలెన్‌ ప్రకటించారు. గతవారం ఇందుకు సానుకూలంగానే గణాంకాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 వరకూ ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దేశీయంగా వారంలో రూ.700కుపైగా డౌన్‌...
ఇక అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ధర వారం వారీగా 10 గ్రాములకు రూ.654 తగ్గి, రూ.28,366కి చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర రూ. 1,277 తగ్గడం గమనార్హం.  దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.745 తగ్గి రూ.28,550కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,400కు పడింది. వెండి కేజీ ధర ముంబై మార్కెట్‌లో రూ. 1,785 తగ్గి రూ.41,065కి పడింది. ఇక్కడ రెండు వారాల్లో పసిడి 10 గ్రాములకు దాదాపు రూ.1000 తగ్గగా, వెండి దాదాపు రూ.2,000కుపైగా నష్టపోయింది.

మరిన్ని వార్తలు