రాజ్యసభకు ప్రియాంక గాంధీ?

17 Feb, 2020 04:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ వాద్రాను రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్‌ యోచిస్తోందా? కాంగ్రెస్‌ దళాన్ని లోక్‌సభలో రాహుల్‌ గాంధీ, రాజ్యసభలో ప్రియాంక గాంధీ నడపాలని కోరుకుంటోందా? అన్న ప్రశ్నలకు పార్టీ వర్గాల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అలా చేయడం వల్ల, కుటుంబ రాజకీయాల విమర్శకు ఊతమిచ్చినట్లు అవుతుందని పార్టీలోని పలువురు నేతలు భావిస్తున్నారు. అలాగే, రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే.. యూపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ప్రియాంక దృష్టి పెట్టలేకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.

మరోవైపు, రాజ్యసభలో ప్రియాంక కీలకంగా వ్యవహరించడం దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తుందనే వర్గం కూడా కాంగ్రెస్‌లో ఉంది. ఢిల్లీ  ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం కార్యకర్తలను ఉత్తేజపర్చాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. రాజ్యసభ సభ్యులుగా సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్, అంబికా సోనీ, దిగ్విజయ్‌ సింగ్‌ల పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ ఖాళీలను ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్తాన్‌ల కోటాతో పూరించాలని కాంగ్రెస్‌ భావిస్తుంది. ఈ ఖాళీల్లో నుంచి ఒక స్థానాన్ని ప్రియాంకకు కేటాయించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. పదవీకాలం ముగుస్తున్న నేతల్లో గులాం నబీ ఆజాద్‌కు మళ్లీ అవకాశం తథ్యమని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు