కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి

31 Mar, 2020 14:44 IST|Sakshi
విజయ్ మాల్యా ( ఫైల్ ఫోటో)

కరోనా సంక్షోభ సమయంలోనైనా తన మొర ఆలకించాలని  వేలకోట్ల రుణాలను ఎగవేసి, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా  ప్రభుత్వాన్ని కోరారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు సంబంధించిన అప్పులను 100 శాతం తిరిగి చెల్లించాలన్న తన కోరికను మన్నించాలంటూ మాల్యా మంగళవారం ట్విటర్ ద్వారా  వేడుకున్నారు. ఇక నైనా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తీసుకున్న రుణాలను మొత్తం తిరిగి చెల్లిస్తానని పదే పదే చెబుతూ వస్తున్నా.. అయినా బ్యాంకులు సిద్ధంగా లేవు. బ్యాంకుల ఆదేశాల మేరకు వారు చేసిన అటాచ్ మెంట్లను విడుదల చేయడానికి ఈడీ కూడా సిద్ధంగా లేదంటూ వరుస ట్వీట్లలో వాపోయారు. కరోనా మహమ్మారితో  దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలోనైనా జోక్యం చేసుకోవాలని ఆర్ధిక మంత్రిని కోరారు.

అలాగే కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు విధించిన దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను గౌరవిస్తున్నామని మాల్యా తెలిపారు. కింగ్ ఫిషర్ లో అన్ని కార్యకలాపాలను, తయారీని సమర్థవంతంగా  నిలిపివేసినట్టు చెప్పారు. అయితే తమ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు  ప్రభుత్వ సహాయాన్ని అర్థించారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంటివద్దనే సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కూడా విజయ్ మాల్యా సూచించారు. తాను కూడా అదే చేస్తున్నానని ట్వీట్ చేశారు.
 

మరిన్ని వార్తలు