భారత ఫార్మాపై కుట్ర జరుగుతోంది..

28 Oct, 2016 00:53 IST|Sakshi
భారత ఫార్మాపై కుట్ర జరుగుతోంది..

ఇక్కడి కంపెనీలపై తప్పుడు ఆరోపణలు
ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పీవీ అప్పాజీ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా సుస్థిర స్థానం సంపాదించుకున్న భారత ఫార్మా రంగం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) అభిప్రాయపడింది. అంతర్జాతీయ జనరిక్స్ మార్కెట్లో పోటీనిస్తున్న దేశీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోందని ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పీవీ అప్పాజీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్లాంట్ల నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియాకు అరబిందో ఫార్మా, ఆర్చిడ్ కెమికల్స్, ఆసియాటిక్ డ్రగ్స్‌లు కారణమవుతున్నాయని లండన్‌కు చెందిన చేంజింగ్ మార్కెట్స్ అనే స్వచ్చంద సంస్థ ఆరోపించిన సంగతి తెలిసిందే. జనరిక్ ఔషధాల తయారీలో ప్రపంచంలోని టాప్-20 సంస్థల్లో భారత్ నుంచి 8 ఉన్నాయని అప్పాజీ గుర్తుచేశారు. భారీ ఆర్డర్లను దక్కించుకుంటున్నాయన్న కారణంగా ఇక్కడి కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు.

 నిజం లేదని తేలింది: పెన్సిలిన్స్, సెఫలోస్పోరిన్, కార్బాపెనిమ్ తయారవుతున్న అరబిందోకు చెందిన యూనిట్-7 సమీపంలో సేకరించిన వ్యర్థాల్లో ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా దర్శనమిచ్చినట్టు చేంజింగ్ మార్కెట్ ఆరోపించింది. అయితే యూనిట్-7లో ఈ ఔషధాలను కంపెనీ తయారు చేయడం లేదు. పైగా యూనిట్-11 నుంచి శుద్ధి చేసిన మురుగునీరు పైపుల ద్వారా నియంత్రణ సంస్థలు నిర్దేశించిన సముద్రం లోపల వదులుతోంది. చేంజింగ్ మార్కెట్ ఆరోపణల్లో నిజం లేదని దీనినిబట్టి అర్థమౌతోందని ఫార్మెక్సిల్ అదనపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టరు రవి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు