నిర్మాణ వ్యయం తక్కువే!

22 Sep, 2018 03:12 IST|Sakshi

హైదరాబాద్‌లో చ.అ. నిర్మాణానికి రూ.2,375

ఇల్లే కాదు ఆఫీస్, షాపింగ్‌ మాల్, హోటల్‌ ఏదైనా చౌకే

సాక్షి, హైదరాబాద్‌: ఇల్లు, ఆఫీస్, షాపింగ్‌ మాల్,  హోటల్, పారిశ్రామిక గోదామ్‌.. ఏదైనా సరే హైదరాబాద్‌లో నిర్మాణ వ్యయం అత్యంత తక్కువ! వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో నిర్మాణ సామగ్రి ధరల్లో స్థిరీకరణతో పాటూ పారదర్శకత నెలకొంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గిందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ దక్షిణాసియా తెలిపింది.

వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పించే రంగం నిర్మాణ రంగం. సిమెంట్, స్టీల్‌ వంటి అనుబంధ పరిశ్రమలు ఆధారపడేది కూడా ఈ రంగమే. 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రియల్‌ ఎస్టేట్‌ రంగం వాటా 13 శాతానికి చేరుతుందని సీబీఆర్‌ఈ అంచనా వేసింది. అలాగే 2025 నాటికి 1.7 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలతో పాటూ సుమారు 819 కోట్ల చ.అ. స్థలం నిల్వకు చేరుతుందని సీబీఆర్‌ఈ తెలిపింది.

జీఎస్‌టీలో ఉత్పత్తుల ధరలు తగ్గాయ్‌..
గత 16 ఏళ్లలో సిమెంట్‌ ధరలు మూడింతలు పెరిగాయి. 2005 నుంచి 2017 మధ్య కాలంలో స్టీల్‌ ధరలు రెండింతలయ్యాయి. దీంతో మౌలిక, నిర్మాణ రంగంలో అభివృద్ధి వ్యయం పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ నగరాల్లో నిర్మాణ వ్యయం ఎలా ఉందని అంశంపై సీబీఆర్‌ఈ పరిశోధన చేసింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాత పన్ను విధానంలో కంటే జీఎస్‌టీలో నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గినట్టు తేలిందని సీబీఆర్‌ఈ దక్షిణాసియా చైర్మన్‌ అన్షుమన్‌ మేగజైన్‌ అన్నారు. రిజిస్టర్డ్‌ సప్లయర్ల నుంచి మాత్రమే సిమెంట్, స్టీల్, టైల్స్, రంగులు వంటి నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేయాల్సి వస్తుందని.. దీంతో ఆయా ఉత్పత్తుల ధరలు స్థిరంగా, పారదర్శకంగా మారాయని ఆయన పేర్కొన్నారు. దిగుమతి పన్నులు పరిశ్రమ మీద ప్రభావాన్ని చూపిస్తుందన్నారు.


చ.అ. నిర్మాణ వ్యయం రూ.2,375
హైదరాబాద్‌లో 15కు పైగా అంతస్తుల అపార్ట్‌మెంట్‌కు, గ్రేడ్‌– ఏ ఆఫీస్‌ నిర్మాణానికి  చ.అ.కు రూ.2,375 నిర్మాణ వ్యయం అవుతుంది. ఇక, షాపింగ్‌ కాంప్లెక్స్‌కు చ.అ.కు రూ.3,895, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు చ.అ.కు రూ.11,400, పెద్ద పారిశ్రామిక స్ట్రక్చర్స్‌కు చ.అ.కు రూ.4,085 నిర్మాణ వ్యయం అవుతుంది.

అత్యధికంగా ముంబైలో..
ముంబైలో నిర్మాణ వ్యయం కాస్త ప్రీమియం. అది ఇల్లు, ఆఫీస్‌ ఏ నిర్మాణమైనా సరే వ్యయంతో కూడుకున్న పని. ఇక్కడ అపార్ట్‌మెంట్, ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణానికి చ.అ.కు రూ.3,125 ఖర్చవుతుంది. షాపింగ్‌ మాల్‌కు చ.అ.కు రూ.5,125, హోటల్‌కు చ.అ.కు రూ.15 వేలు, పారిశ్రామిక స్ట్రక్చర్‌కు చ.అ.కు రూ.5,375 వ్యయమవుతుంది.

మరిన్ని వార్తలు