త్వరలో తిరుపతి ప్లాంట్‌ నిర్మాణం: లావా

25 Jul, 2018 00:08 IST|Sakshi

వచ్చే 12–18 నెలల్లో 40% మార్కెట్‌ వాటా లక్ష్యం

మార్కెట్లోకి లావా జెడ్‌61 స్మార్ట్‌ఫోన్‌

తిరుపతి: దేశీ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ లావా మొబైల్స్‌ త్వరలోనే తిరుపతి ప్లాంట్‌ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి లే అవుట్‌ సిద్ధమయిందని, నిర్మాణ పనులను ప్రారంభిస్తామని లావా ఇంటర్నేషనల్‌ ప్రొడక్ట్‌ హెడ్‌ గౌరవ్‌ నిగమ్‌ చెప్పారు. మంగళవారం మార్కెట్లోకి లావా జెడ్‌61 స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం కంపెనీకి 1,100 మంది పంపిణీదారులున్నారు.

ఇప్పటివరకు పట్టణ, సబ్‌–అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో ఉనికిని చాటుకున్న లావా ఇక నుంచి 10,000 జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేస్తోంది. వచ్చే 12–18 నెలల్లో 40 శాతం మార్కెట్‌ వాటాను సొంత చేసుకోవాలనేది  సంస్థ లక్ష్యం. ఇందులో భాగంగా నోయిడా ప్లాంటులో ఉత్పత్తిని పెంచడం, తిరుపతి ప్లాంట్‌ నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నాం’’ అని గౌరవ్‌ నిగమ్‌ వివరించారు.

ఆఫ్రికాకు ఎగుమతయ్యే హ్యాండ్‌సెట్ల తయారీ పూర్తిగా భారత్‌లోనే కొనసాగుతోందని చెప్పారు. లావా జెడ్‌61 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 18:9 ఫుల్‌వ్యూ హెచ్‌డీ డిస్‌ప్లే, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ.5,750 కాగా.. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ.6,750గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.  

మరిన్ని వార్తలు