మూడేళ్లు వెనక్కి?

4 Oct, 2017 12:46 IST|Sakshi

ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల సంకేతాలు

పెరుగుతున్న ధరలు, పడిపోతున్న పారిశ్రామికోత్పత్తి 

తగ్గిన ఎగుమతులు; పెరిగిన దిగుమతులు

మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5.7 శాతమే!

లక్ష్యాలకు దూరంగా, ద్రవ్య, వాణిజ్య ‘లోటు’

పెద్ద నోట్ల రద్దు; జీఎస్‌టీల ప్రభావమే అధికం 

అందుకే రూపాయి, స్టాక్‌ మార్కెట్‌ కూడా క్షీణత  

అర్ధరాత్రి ప్రకటనతో రద్దయిన పెద్ద నోట్లు... ఆ తరవాత తెచ్చిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నగదు అందుబాటులో లేక కొన్ని నెలలపాటు చిన్నచిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితం... ఈ ఏడాది తొలి త్రైమాసికంలో... అంటే ఏప్రిల్‌–జూన్‌ మధ్య వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది. దీనికి జూలైలో జీఎస్‌టీ తోడయింది. అటు వ్యాపారస్తుల్ని, ఇటు వ్యవస్థల్ని సిద్ధం చేయకుండానే అమల్లోకి తెచ్చిన జీఎస్‌టీ... వ్యాపారాలను పెద్దదెబ్బే కొట్టింది. ఫలితం... జూలై నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 1.2 శాతానికి పరిమితమయింది.

ఇక ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి పెరిగిపోయింది. ఎగుమతులు పడిపోయి, దిగుమతులు పెరిగిపోవటంతో కరెంటు ఖాతా లోటు జూన్‌ త్రైమాసికంలో ఏకంగా నాలుగేళ్ల గరిçష్ట స్థాయి 2.4%కి చేరింది. దీంతో స్టాక్‌ మార్కెట్లూ దిగువబాట పట్టాయి. రూపాయి విలువ కూడా క్షీణిస్తోంది. అంటే...! ఆర్థిక వ్యవస్థ మళ్లీ మూడేళ్ల వెనక్కి పోయిందా? ఇపుడివే సందేహాలు పలువురు విశ్లేషకుల నోటివెంట వినిపిస్తున్నాయి.

పెట్రోల్, బంగారం కలిసొచ్చాయి...
బీజేపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన 2014 ప్రథమార్ధంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ బాగా బలహీనపడి ఉన్నాయి. 2013–14 సంవత్సరాల్లో కరెంటు ఖాతా లోటు భారీగా పెరిగిపోవడం.. ఫలితంగా రూపాయి దారుణంగా బలహీనపడి ఏకంగా 69 స్థాయికి పతనం కావటం... ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి ఎగబాకడం... పారిశ్రామికోత్పత్తి పడకేయడం వంటి అవలక్షణాలన్నీ  తాండవించాయి. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది.

అయితే 2014 చివరి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నాటకీయంగా 120 డాలర్ల నుంచి 25 డాలర్ల స్థాయికి పతనం కావడంతో భారత్‌కు శుభ దినాలు మొదలయ్యాయి. చమురు దిగుమతులకోసం భారత్‌ వెచ్చించే విదేశీ మారక ద్రవ్యం బాగా తగ్గింది. చమురు దిగుమతుల విలువ కూడా తగ్గింది. దాంతో సహజంగానే రూపాయి విలువ మెరుగుపడింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా దిగొచ్చాయి. ముఖ్యంగా డీజిల్‌ తగ్గడంతో ధరలూ తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణం 6%కి తగ్గిపోయింది.

ఇక పెట్రో ఉత్పత్తుల తరవాత భారీగా దిగుమతి చేసుకునే బంగారంపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది. పసిడి దిగుమతులపై ఆంక్షలు విధించటమే కాక... దిగుమతి సుంకాల్ని పెంచడం, భౌతిక రూపంలో బంగారంలో పెట్టుబడుల్ని నిరుత్సాహపర్చడం, గోల్డ్‌ బాండ్ల వంటి పేపర్‌ బంగారంపై పెట్టుబడుల్ని ప్రోత్సహించటం వంటి పలు చర్యల్ని తీసుకుంది.  ఫలితం... కరెంటు ఖాతాలోటు అదుపులోకి వచ్చింది. దీంతో 2016–17లో మన ఆర్థిక వ్యవస్థ పలు ఆసియా, వర్థమాన దేశాలకన్నా స్థిరంగా వుంది. కానీ గతేడాది నవంబర్‌ నెలలో ప్రస్తుత అల్లకల్లోలానికి బీజం పడింది. అదే డీమానిటైజేషన్‌.

చెదిరిన లోటు లక్ష్యాలు ....
ఈ ఆర్థిక సంవత్సరానికి 3.2 శాతం ద్రవ్యలోటును(ప్రభుత్వ వ్యయం–ఆదాయం మధ్య వ్యత్యాసం–రూ.5.46 లక్షల కోట్లు) బడ్జెట్లో నిర్దేశించారు.  అయితే ఇది ఏప్రిల్‌–ఆగస్టు.. ఈ ఐదు నెలల్లోనే 96.2 శాతానికి చేరిపోయింది. అంటే రూ. 5.25 లక్షల కోట్లు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే క్రమంలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.5 శాతాన్ని మించిపోవచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయి.

దానికి తోడు రెవెన్యూలోటు (ప్రభుత్వ రెవిన్యూ వసూళ్లు–రెవిన్యూ చెల్లింపుల మధ్య వ్యత్యాసం) బడ్జెట్లో నిర్దేశించిన రూ.4.31 లక్షల కోట్ల లక్ష్యాన్ని ఇప్పటికే దాటేసింది. ఇక క్రూడ్‌ ధరలు పెరగడంతో దిగుమతుల చెల్లింపుబిల్లు ఎగబాకడం, డీమోనిటటైజేషన్, జీఎస్‌టీ ప్రభావాలతో మరోవైపు ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య లోటు (ఎగుమతుల విలువ– దిగుమతుల విలువల మధ్య వ్యత్యాసం), కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వచ్చి, పోయే విదేశీ కరెన్సీ విలువ మధ్య వ్యత్యాసం) పెరిగిపోతోంది. కరెంటు ఖాతా లోటు ఏప్రిల్‌–ఆగస్టు మధ్యకాలంలో రూ.92,950 కోట్లకు (జీడీపీలో 2.4%) పెరిగింది. వాణిజ్య లోటు ఏప్రిల్‌–ఆగస్టు మధ్యకాలంలో రూ.2.4 లక్షల కోట్లకు ఎగిసింది.


చిన్న, మధ్యతరహా వ్యాపారాలు కుదేలు
బ్లాక్‌ మనీని ఏరి పారేయటం, ఉగ్రవాదానికి అందుతున్న నిధులకు అడ్డుకట్ట వేయటం అనే లక్ష్యాలతో గతేడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన... అప్పుడు ప్రజల్ని, ఇప్పుడు మొత్తంగా ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లో పడేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నోట్ల లావాదేవీలపై ఆధారపడే చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కుదేలయ్యాయి. జీడీపీలో ఈ చిన్న, మధ్య తరహా వ్యాపారాల వాటా తక్కువేమీ కాదు.

దేశ స్థూల జాతీయోత్పత్తిలో 38 శాతం ఇవే సమకూరుస్తుండగా, 42 శాతం ఎగుమతులు కూడా వీటివే. గతేడాది జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్లో 7.5 శాతం ఉన్న జీడీపీ వృద్ధి రేటు... నోట్ల రద్దు అమలైన డిసెంబర్‌ క్వార్టర్లో 7 శాతానికి, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.1 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాత జీఎస్‌టీ అమలుకు ముందు క్వార్టర్‌ అయిన ఏప్రిల్‌–జూన్‌లో 5.7 శాతానికి పతనమయ్యింది. గత 13 త్రైమాసికాల్లో ఇంత కనిష్ట వృద్ధి రేటు ఇదే ప్రథమం. జీడీపీ వృద్ధి రేటు ఇంతలా పతనంకావడానికి జీఎస్‌టీ అమలు కూడా కారణమయ్యింది.

జీఎస్‌టీ ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినా.. ఇది అమలుకాబోతున్న నేపథ్యంలో కంపెనీలు డీస్టాకింగ్‌ (అప్పటికే ఉన్న నిల్వల్ని విక్రయించడం) ప్రక్రియను చేపట్టడంతో ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్లో ఉత్పత్తిని తగ్గించివేశాయి. దాంతో ఈ ఏడాది మార్చిలో 3.8 శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్‌లో 3.1 శాతానికి, మేలో 1.7 శాతానికి తగ్గుతూ... జూన్‌లో ఏకంగా 0.1%కి పతనమయింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన జూలై నెలలో ఇది 1.2% నమోదైనా, 2016–17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బాగా తక్కువే. పారిశ్రామికోత్పత్తి తగ్గుదల వినియోగంపైనా, పన్ను వసూళ్లపైనా, కార్పొరేట్‌ ఆదాయాలపైనా పడినట్లు తదుపరి వెలువడిన గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.


అడ్వాన్స్‌ ట్యాక్స్‌ తగ్గింది..
ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లలో వృద్ధి 11%కి పరిమితమయింది. గతేడాది ఇదేకాలంలో వృద్ధి 14%. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక రెండో నెలైన ఆగస్టులో జీఎస్‌టీ వసూళ్లు జూలైతో పోలిస్తే 3.6% క్షీణించాయి.

జూలై, ఆగస్టు నెలల్లో ఇవి దాదాపు రూ.92 వేల కోట్లు... రూ.90 వేల కోట్లు. పన్ను ఎగవేత దారులపై ఉక్కుపాదం, క్షమాభిక్ష స్కీములు వంటి అంశాల వల్ల పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రెండంకెల వృద్ధి నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, జీఎస్‌టీ అమల్లో తలెత్తిన తీవ్ర సమస్యలు, రిటర్నులు దాఖలు చేయడంలో నెలకొన్న గందరగోళంతో పరోక్ష పన్ను వసూళ్ల బడ్జెట్‌ లక్ష్యాన్ని కేంద్రం చేరుకోకపోవొచ్చన్న అంచనాలున్నాయి.

పైగా జీఎస్‌టీ చెల్లింపుదారులు... వారి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను ఎంతమేర క్లెయిమ్‌ చేస్తారనే అంచనాలు అటు ప్రభుత్వానికిగానీ, ఇటు వివిధ ఏజెన్సీలకుగానీ లేవు. ఈ క్లెయిమ్‌లు భారీగా ఉంటే...పన్ను వసూళ్ల లక్ష్యం దెబ్బతిని, ద్రవ్యలోటు, రెవెన్యూలోటు తడిసి మోపడవుతుందన్న భయాలు నెలకొన్నాయి.


స్టాక్‌ మార్కెట్, రూపాయిపై ఎఫెక్ట్‌
వ్యవస్థలో ఏ సంకేతాౖన్నైనా, త్వరితంగా ఒడిసిపట్టుకునే స్టాక్‌ మార్కెట్‌... భారత ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ఈ ప్రతికూల మార్పుల్ని పసిగట్టి కొద్ది వారాల నుంచి పడిపోతోంది.  ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకూ మన స్టాక్‌ మార్కెట్‌ అప్రతిహత ర్యాలీ సాగించింది.

అయితే డీమోనిటైజేషన్, జీఎస్‌టీలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడికావడంతో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వరుసగా క్షీణత చవిచూసింది. మరోవైపు అమెరికా,   బ్రెజిల్, మరికొన్ని ఆసియా మార్కెట్లు కొత్త గరిష్టస్థాయిల్ని చూస్తున్నా...బీఎస్‌ఈ సూచీ ఇటీవలి రికార్డు స్థాయి నుంచి 4 శాతంవరకూ పతనమయింది. ఇదేరీతిలో డాలరుతో రూపాయి మారకపు విలువ 63.50 నుంచి 3 శాతంపైగా పతనమై 65.5 స్థాయికి చేరింది. ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ పట్ల ఎలర్ట్‌గా వుండే విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టు నెలలో రూ.12,000 కోట్లు, సెప్టెంబర్‌ నెలలో రూ. 11,000 కోట్ల చొప్పున స్టాక్‌ మార్కెట్లో అమ్మకాలు సాగించారు.

– (సాక్షి, బిజినెస్‌ విభాగం)

మరిన్ని వార్తలు