3డీకి కంటెంట్ షాక్..!

19 Jul, 2013 03:08 IST|Sakshi
3డీకి కంటెంట్ షాక్..!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 3డీ టీవీలో ముచ్చటగా బొమ్మలు చూడాలనుకునేవారికి కంటెంట్ షాకిస్తోంది. ఎంచక్కా త్రీడీ అనుభూతిని సొంతం చేసుకోవాలనుకుని, ఖర్చుకు వెనకాడకుండా టీవీ కొన్నవారికి టీవీ అయితే దక్కుతోంది కానీ దాన్లో త్రీడీ ప్రసారాలు మాత్రం కరువవుతున్నాయి. సినిమా డీవీడీలు ప్లే చేసుకోవటం మినహా... చానెళ్లేవీ త్రీడీ కార్యక్రమాల్ని ప్రసారం చేయకపోవటం... అడపాదడపా ప్రసారం చేసిన చానెళ్లు కూడా నిలిపేస్తుండటంతో ఈ ప్రభావం అమ్మకాలపై పడుతోంది. పోనీ సినిమాలకే పరిమితం అవుదామనుకున్నా ఇక్కడ విడుదలవుతున్న 3డీ సినిమాల సంఖ్య కూడా అతి స్వల్పం కావటం గమనార్హం.
 
 భారత్‌లో ఏటా 60 లక్షల టీవీలు అమ్ముడవుతున్నాయి. ఇందులో 3డీ టీవీల వాటా 5 నుంచి 7 శాతం మధ్య ఉంది. కొన్నాళ్లుగా ఈ విభాగం పుంజుకున్నా... గడిచిన ఏడాదిలో మాత్రం వీటి అమ్మకాలు ఆశించినంతగా పెరగటం లేదని అమ్మకందారులు చెబుతున్నారు. ‘‘ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదు కావటానికి ప్రధాన కారణం కంటెంట్ లేకపోవడం వల్లే. అంతేతప్ప జనానికి త్రీడీ నచ్చక కాదు’’ అని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తనను సంప్రదించిన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు.
 
 ‘‘3డీ టీవీ కొనేందుకు కస్టమర్ల దగ్గర డబ్బులైతే ఉన్నాయి. త్రీడీని ఎంజాయ్ చేయాలన్న కోరిక కూడా వారికుంది. కావాల్సిందల్లా కంటెంటే. కంటెంట్ లేకుంటే టీవీ చూడలేం కదా’’ అన్నారాయన. త్రీడీ టీవీలకు దేశంలో డిమాండ్ ఉందని, అయితే కంటెంట్ పెద్ద సమస్యగా పరిణమించిందని ఒనిడా బ్రాండ్‌తో టీవీలను తయారు చేస్తున్న మిర్క్ ఎలాక్ట్రానిక్స్ సీఎండీ జి.ఎల్.మిర్‌చందానీ చెప్పారు. భారత్‌లో 3డీ టీవీలు రూ.40 వేల నుంచి లభిస్తున్నాయి. 3డీ కాకుండా రూ.40 వేలు ఆపైన ఖరీదున్న టీవీల వాటా మొత్తం అమ్మకాల్లో 15 శాతం ఉంటుంది. వృద్ధి 30-35 శాతం ఉండడం ఇక్కడ గమనార్హం.
 
 ధర కూడా కారణమే...
 ఎల్‌ఈడీ విభాగంలో చూస్తే త్రీడీ టీవీకి, అదే పరిమాణంలో ఉండే సాధారణ టీవీకి ధరలో చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ వ్యత్యాసం బ్రాండ్లను బట్టి కనీసం 40 శాతం నుంచి గరిష్టంగా 70 శాతం వరకూ ఉంటోంది. పోనీ ఇంత ధర పెట్టి వినియోగదారులు త్రీడీ టీవీ కొన్నా ఏ చానెల్ కూడా త్రీడీ ప్రసారాలు చేయటం లేదు. త్రీడీ సంగతి సరేసరి. నిజం చెప్పాలంటే చాలా చానెళ్లు ఇప్పటికీ హైడెఫినిషన్ (హెచ్‌డీ) ప్రసారాలకు సైతం ఆమడదూరంలో ఉన్నాయి.
 
 హెచ్‌డీ కంటెంట్ లేకున్నా దాదాపు ప్రతి టీవీ హెచ్‌డీ సౌకర్యంతోనే వస్తోంది కూడా. ఈ అనుభవంతో త్రీడీ టీవీని అంత ధర పెట్టి కొన్నా లాభం లేదన్న ఉద్దేశంతో చాలామంది వీటికి దూరంగానే ఉంటున్నారు. గతంలో ఈఎస్‌పీఎన్ చానెల్ పలు ప్రసారాలను త్రీడీలో ఇచ్చింది. కానీ ఆదరణ లేకపోవటంతో ఈ ఏడాది జూన్ నుంచి త్రీడీ ప్రసారాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బీబీసీ సైతం కొన్ని కార్యక్రమాలను త్రీడీలో ప్రొడ్యూస్ చేసి ప్రసారం చేసింది. ఆశించిన స్థాయిలో జనం చూడటం లేదని చెబుతూ... ఈ నెల్లోనే అది కూడా త్రీడీ ప్రసారాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
 
 దీంతో ఇపుడు త్రీడీ టీవీలు సినిమాలు చూడటానికే పరిమితమవుతున్నాయనేది వినియోగదారుల భావన. దీనిపై ఓ వినియోగదారు మాట్లాడుతూ ‘కంటెంట్ లేకుంటేనేం! నెలకు ఒక్క 3డీ సినిమా అయినా టీవీలో చూడొచ్చుగా! 3డీని కూడా టీవీలో ఒక ఫీచర్‌గానే చూడాలి. ఇతర టీవీల్లో మాదిరే కార్యక్రమాలను చూడాలి’ అన్నారాయన. అయితే కంటెంట్, సినిమాల సంఖ్య పెరిగితేనే త్రీడీ టీవీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరుగతాయన్నది నిజమని ఆదీశ్వర్ ఏపీ ఆపరేషన్స్ హెడ్ బాలాజీ రామ్ చెప్పారు. రాష్ట్రంలో నెలకు 5,000ల 3డీ టీవీలు అమ్ముడవుతున్నాయని చెప్పారాయన. 3డీని ఎంజాయ్ చేయాలంటే తప్పనిసరిగా కళ్లజోడు పెట్టుకోవాల్సి రావటం... ఇంట్లో ఉన్న వాళ్లంతా వీటిని ధరించాల్సి రావటం... గంటలు గంటలు కళ్లజోడు పెట్టుకుని చూడటం కష్టం కావటం  కూడా త్రీడీ వీక్షణంపై ప్రభావం చూపిస్తున్నట్లు బీబీసీ, ఈఎస్‌పీఎన్ పేర్కొనటం గమనార్హం.
 

మరిన్ని వార్తలు