ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహకాలు కొనసాగింపు

25 Sep, 2017 01:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాలకు మరో ఆరు నెలల పాటు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఫేమ్‌ ఇండియా పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు లేదా నీతి ఆయోగ్‌ ఈ పథకం రెండో దశను ప్రారంభించే వరకు అమల్లో ఉంటుందని భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ బైక్‌ అయితే రూ.29,000 వరకు, కారు అయితే రూ.1.38 లక్షల వరకు కొనుగోలు దారులకు రాయితీ లభిస్తుంది.

2030 నాటికి నూరుశాతం ఎలక్ట్రిక్‌ వాహనాలు కలిగిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని కేంద్రం విధించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫేమ్‌ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద మొదటి దశలో రెండేళ్ల కాలానికి, వచ్చే ఏడాది మార్చి వరకు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చితో గడువు తీరిపోగా, తర్వాత దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించారు. తాజాగా మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

>
మరిన్ని వార్తలు