బంగారం ధరెంతో తెలుసా?

26 Sep, 2016 00:26 IST|Sakshi
బంగారం ధరెంతో తెలుసా?

నిర్ణయించడానికి కొన్ని సూత్రాలు
అంతర్జాతీయ ధర, డాలర్ మారకం ఆధారం
డిమాండ్ సరఫరాలతో పాటు పలు అంశాల ప్రభావం

 చమురు, రాగి వంటి ఎన్ని కమాడిటీలున్నా... బంగారం ప్రత్యేకత బంగారానిదే. పెట్టుబడి సాధనంగా, పారిశ్రామిక  పరంగా, అవసరాల్లో ఆదుకునే ఆపద్బాంధవిగా పసిడి మెరుపు ఎప్పటికీ  తగ్గదు. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ధరల్లో భారీగా హెచ్చుతగ్గులుండవు. అందుకని హెడ్జింగ్‌కు గొప్ప సాధనంగా బంగారాన్ని ఉపయోగిస్తారు. మరి ఇంతటి విలువైన బంగారం ధరలను నిర్ణయించేదెలా? ఒకసారి చూద్దాం...

 వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ప్రజలపై కమోడిటీ మార్కెట్ల ప్రభావం బలంగానే ఉంటుంది. కీలకమైన కమోడిటీల్లో కొరత ఏర్పడితే... ఆ కమోడిటీ సంబంధిత ఉత్పత్తులను చేజిక్కించుకోవాలనే తపన వినియోగదారుల్లో ఉంటుంది. దీంతో ఉత్పత్తిదారులు అధిక ధరలను డిమాండ్ చేస్తారు. వినియోగదారులేమో తమకు నచ్చిన కమోడిటీలను కొనుగోలు చేయడానికి అధిక ధరలు చెల్లించడానికైనా సై అంటారు. మరోవైపు సరఫరాలు అధికంగా ఉంటే ధరలు తగ్గుతాయి.

నాలుగు రకాల కమోడిటీలు..
సాధారణంగా కమోడిటీలను 4 కేటగిరీలుగా విభజిస్తారు. ఇంధనం (ముడి చమురు, హీటింగ్ ఆయిల్, సహజవాయువు, గ్యాసోలిన్ తదితరాలు), లోహాలు (బంగారం, వెండి, ప్లాటినమ్, రాగి...మొదలైనవి), లైవ్ స్టాక్, మాంసం (గొర్రెలు, పోర్క్ బెల్లీ, ఇత్యాది), వ్యవసాయ ఉత్పత్తులు (మొక్కజొన్న, సోయాబిన్, గోధుమ, వరి, కొకోవా, కాఫీ, పత్తి, పంచదార... తదితరాలు). బంగారం లోహాల కేటగిరి కిందకు వస్తుంది.

కమోడిటీ ట్రేడింగ్ కొంచెం భిన్నం...
కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేయడం, ట్రేడింగ్ చేయడం కాస్త భిన్నంగా ఉంటుంది. స్టాక్స్, బాండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లుగా, ట్రేడింగ్ చేసినట్లుగా కమోడిటీల్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. కమోడిటీ ట్రేడింగ్ చేయాలంటే ముందుగా ఆమోదయోగ్యమైన ప్రమాణాలు అవసరం. ఇలాంటి ఆమోదయోగ్యమైన ప్రమాణాల కారణంగా భౌతికంగా ఆ కమోడిటీలను తనిఖీ చేయకుండానే ట్రేడింగ్ చేస్తుంటారు. డిమాండ్ - సరఫరాలతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి, మార్కెట్ డిమాండ్ తదితర అంశాలు ముడి చమురు, అల్యూమినియం, రాగి, పంచదార వంటి కమోడిటీ ధరలపై ప్రభావం చూపుతాయి.

పుత్తడిలోకి పెట్టుబడులు...
స్టాక్ మార్కెట్ తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నా... లేక బాగా పడిపోతూ ఉన్నా... ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా తమ సొమ్మును స్టాక్ మార్కెట్ నుంచి విలువైన లోహమైన బంగారంలోకి మళ్లిస్తారు. తరతరాలుగా విశ్వసనీయమైన, ఆధారపడతగ్గ ఆస్తిగా పుత్తడికి ప్రాధాన్యం ఉండటమే దీనికి కీలక కారణం. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నపుడు, కరెన్సీ విలువ పడిపోయినపుడు హెడ్జింగ్‌గా విలువైన లోహాలు ఉపయోగపడతాయి. అయితే కమోడిటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం కొంత రిస్క్‌తో కూడిన వ్యవహారమేనని చెప్పొచ్చు. సరైన వ్యూహాం లేకుండా ఇలా నేరుగా కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు వచ్చే అవకాశాలే అధికం.

ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్
ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. షేర్ల ట్రేడింగ్‌కు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఎలాగో, కమోడిటీల ట్రేడింగ్‌కు ఎంసీఎక్స్ అలాగన్నమాట. ఈ ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు, పత్తి, కాఫీ వంటి వ్యవసాయోత్పత్తులు, తదితర కమోడిటీల్లో ట్రేడింగ్ జరుగుతుంది. లావాదేవీలు సురక్షితంగా, పారదర్శకంగా, నియమనిబంధనలకనుగుణంగా జరిగేలా ఎంసీఎక్స్ చూస్తోంది.

ధరలను నిర్ణయించేవి..
ట్రేడింగ్ కార్యకలాపాలు, ఇంకా మరికొన్ని అంశాలు కమోడిటీల ధరలను నిర్ణయిస్తాయి. అంతర్జాతీయ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, బంగారం, వెండి లోహాల ధరలు ఏ యూనిట్లలో కోట్ అవుతున్నాయి? ట్రాయ్ ఔన్స్-గ్రాముల మారకం,  ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో సరఫరా, డిమాండ్ తదితర అంశాలు.. ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలను నిర్ణయిస్తాయి.

ఎంసీఎక్స్ గోల్డ్ ధర ఎలా నిర్ణయిస్తారంటే,
పై అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఒక సాధారణ సూత్రంతో పుత్తడి ధరను నిర్ణయిస్తారు. ఎంసీఎక్స్‌లో పుత్తడి 10 గ్రాముల యూనిట్లలో కోట్ అవుతోంది. ఒక ట్రాయ్ ఔన్స్ 31.1 గ్రాములకు సమానం.  దీని ఆధారంగా 10 గ్రాముల బంగారం ధరను నిర్ణయిస్తారు.

అంటే... 10 గ్రాముల బంగారం ధర= (అంతర్జాతీయంగా పుత్తడి ధర) ్ఠ (డాలర్‌తో రూపాయి మారకం) ్ఠ 10 ్ఠ (ట్రాయ్ ఔన్స్-గ్రామ్ మారకం విలువ).

పసిడి... మరో 2 నెలలు మెరుపే!
ముంబై/న్యూయార్క్: పసిడి ధరపై సానుకూల అంచనాలు సమీప కాలంలో పటిష్టంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వారం మధ్యన మంగళ-బుధవారాల్లో  జరిగిన కీలక సమావేశాల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్-  ఫెడ్ ఫండ్ రేటును పెంచకపోవడం పసిడికి బలాన్నిచ్చింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ధర ఔన్స్(31.1గ్రా)కు వారం వారీగా 28 డాలర్లు ఎగసింది. 1,341 డాలర్ల వద్ద ముగిసింది. జూన్ తరువాత పసిడి ఒక వారంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితుల్లో పసిడి మరో ఒకటి రెండు నెలలు పటిష్ట ధోరణిలోనే కొనసాగుతుందన్నది నిపుణుల అభిప్రాయం.

డిసెంబర్ నాటికి రేటు పెంచుతామని ఫెడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా దిగువ స్థాయిలో ఫండమెంటల్స్ పటిష్టంగా లేకపోవటం వల్ల, ఒకవేళ ఫెడ్ రేటు పెంచినా...  పసిడి ముందుకే సాగుతుందన్న వాదనా ఉంది. 0.25 శాతంగా ఉన్న ఫండ్ రేటు పెంచితే,  పసిడి ఔన్స్‌కు 1,000 డాలర్ల దిగువకు పడిపోతుందన్న మెజారిటీ విశ్లేషణలకు అంచనాలకు భిన్నంగా ఇప్పటి వరకూ పసిడి పరుగులు తీయటం గమనార్హం. మరోవైపు దేశీయంగానూ పసిడి గత వారంలో బలపడింది. 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధరలు వరుసగా రూ.370 చొప్పున ఎగశాయి. వరుసగా రూ.31,570, రూ.31,420 వద్ద ముగిశాయి. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.1,650 ఎగసి రూ.47,235 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు