అక్టోబర్‌లో ‘మౌలిక’ వృద్ధి 4.7%

1 Dec, 2017 01:14 IST|Sakshi

∙సిమెంట్, స్టీల్, రిఫైనరీ ఎరువుల రంగాల పేలవ పనితీరు

గతేడాది ఇదే నెలలో వృద్ధి రేటు 7.1 శాతం  

న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక పరిశ్రమ రంగాల పనితీరు అక్టోబర్‌లో మందగించింది. ఉత్పాదకత వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 7.1 శాతంగా ఉంది. ప్రధానంగా సిమెంట్, స్టీల్, రిఫైనరీ ఉత్పత్తుల పేలవ పనితీరు మౌలిక రంగం మందగమనానికి ప్రధాన కారణంగా నిలిచింది. మరోపక్క, సెప్టెంబర్‌ నెల వృద్ధి రేటును పరిశ్రమల శాఖ 5.2 శాతం నుంచి తాజాగా 4.7 శాతానికి సవరించింది. ముఖ్యాంశాలివీ...

∙అక్టోబర్‌లో సిమెంట్‌ ఉత్పాదకత 2.7 శాతం క్షీణించింది. గతేడాది ఇదే నెలలో వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైంది.
∙స్టీల్‌ రంగంఉత్పాదకత వృద్ధి 17.4 శాతం నుంచి 8.4 శాతానికి దిగజారింది.
∙రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి కూడా గతేడాది అక్టోబర్‌లో 12.6 శాతం నుంచి ఈ అక్టోబర్‌లో 7.5 శాతానికి పడిపోయింది.
∙బొగ్గు రంగం మాత్రం కాస్త మెరుగ్గా 1.9 శాతం క్షీణత నుంచి 3.9 శాతానికి వృద్ధి చెందింది.
∙ఎరువుల రంగం వృద్ధి 0.7 శాతం నుంచి 3 శాతానికి ఎగబాకింది.
∙ఇక విద్యుత్‌ ఉత్పాదకత స్వల్పంగా 3 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గింది.
∙ ముడిచమురు ఉత్పత్తి 3.2 శాతం క్షీణత నుంచి 0.4 శాతం క్షీణతకు కాస్త మెరుగుపడింది.  
∙సహజవాయువు ఉత్పాదకత 1.5% క్షీణత నుంచి 2.8% వృద్ధి బాటకు పురోగమించింది.
ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలానికి చూస్తే...
ఈ ఆర్థిక సంవత్సరం 7 నెలల కాలానికి.. మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు 3.5%కి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 5.6%గా నమోదైంది. ఎనిమిది కీలక మౌలిక పరిశ్రమలకు మొత్తం పారిశామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 40.27 శాతం వెయిటేజీ ఉంది.  

మరిన్ని వార్తలు