కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్

4 Apr, 2020 15:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై:  కరోనా వైరస్  విస్తరణను అడ్డుకునేందుకు 21 రోజుల లాక్ డౌన్  దేశవ్యాప్తంగా అమలవుతోంది. నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్లు వాడడం,  కనీస భౌతిక దూరాన్ని పాటించడం లాంటి చర్యలు గత పదిరోజులుగా దాదాపు దేశ ప్రజలందరికి అలవాటుగా మారిపోయింది. అయితే  కరెన్సీ నోట్ల మీద, పేపర్ మీద కూడా వైరస్  తిష్టవేసుకుని కూచుంటుందని, జాగ్రత్తలు అవసరమన్న హెచ్చరికలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగి అనుసరించిన పద్థతి, చెక్ తీసుకున్న వైనం చక్కర్లు కొడుతోంది.  సోషల్ మీడియాలో నిరంతరం చురుగ్గా వుంటూ, ఎన్నో ఆసక్తికర, విజ్ఞాన దాయక వీడియోలను పంచుకునే  ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను ట్వీట్ చేయడం విశేషం. వాట్సాప్ వండర్ బాక్స్ లో వచ్చిన వీడియోను షేర్ చేస్తూ ఈ టెక్నిక్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గానీ,  క్యాషియర్ సృజనాత్మకతను  మాత్రం మెచ్చుకోవాలని  ఆయన పేర్కొన్నారు. 

చేతికి గ్లౌజులు, నోటికి మాస్క్ లాంటి నియమాలను పాటించిన సదరు బ్యాంకు ఉద్యోగి వినియోగదారుడు నుంచి, చెక్కును ప్లకర్ తో అందుకోవడం, ఆ తరువాత దాన్ని పక్కనే సిద్ధంగా ఉంచుకున్న ఐరన్  బాక్స్ తో ఇస్త్రీ చేసి మరీ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రక్రియ కరోనాను అడ్డుకునేందుకు ఎంతవరకు పనికి వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. కాగా లాక్‌డౌన్  సమయంలో దేశ ప్రజలందరూ ఇంటి పరిమితమైనప్పటికీ ప్రజల సౌకర్యార్ధం కొన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, వైద్యం, కిరాణా, బ్యాంకింగ్, మీడియా వంటి ముఖ్యమైన సేవలకు అనుమతి వుంది. అయినా దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా ఢిల్లీ నిజాముద్దీన్ ఉదంతం అనంతరం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే.

చదవండి : కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు
లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది
కరోనా సంక్షోభం: స్నాప్‌డీల్  డెలివరీ హామీ

మరిన్ని వార్తలు